ఎగుమతులకు టారిఫ్‌ల సెగ | US tariffs have a severe impact on many sectors | Sakshi
Sakshi News home page

ఎగుమతులకు టారిఫ్‌ల సెగ

Aug 1 2025 1:53 AM | Updated on Aug 1 2025 7:03 PM

US tariffs have a severe impact on many sectors

అమెరికా సుంకాలతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం 

టెక్స్‌టైల్స్, రత్న ఆభరణాలు తదితర పరిశ్రమలకు దెబ్బ 

ఉపాధి అవకాశాలపైనా ఎఫెక్ట్‌.. 

నిపుణులు, పరిశ్రమ వర్గాల విశ్లేషణ

భారత ఎగుమతులపై అమెరికా ఎకాయెకిన 25 శాతం టారిఫ్‌లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీనితో అమెరికన్‌ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్‌టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలకు కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు కనీసం 25 శాతం ఎగుమతులు తగ్గినా, వాణిజ్య ఆదాయాలపరంగా ఏటా 21.75 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. 

ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మారకం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్‌ మార్కెట్లపరంగా చూస్తే ఎగుమతుల ఆధారిత రంగాలకు చెందిన (టెక్స్‌టైల్స్, జ్యుయలరీ మొదలైనవి) సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్‌లపై వివిధ  రంగాలపై పడే ప్రభావాలపై ఈ ప్రత్యేక కథనం.      – బిజినెస్‌ డెస్క్‌

రత్నాభరణాలు: రత్నాభరణాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అగ్రరాజ్యానికి ఎగుమతులు సుమారు 10 బిలియన్‌ డాలర్లుగా ఉంటున్నాయని రత్నాభరణాల ఎగుమతుల మండలి జీజేఈపీసీ చైర్మన్‌ కిరీట్‌ భన్సాలీ తెలిపారు. భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించడం వల్ల వ్యయా పెరిగిపోవడానికి, ఎగుమతుల్లో జాప్యానికి దారి తీస్తుందని, చిన్న స్థాయి వ్యాపారుల నుంచి భారీ తయారీ సంస్థల వరకు అందరిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పడిపోవడం, ఆర్డర్లు రద్దు కావడం, ఎగుమతిదారుల మార్జిన్లు తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని రిద్ధిసిద్ధి బులియన్స్‌ (ఆర్‌ఎస్‌బీఎల్‌) ఎండీ పృథ్వీ రాజ్‌ కొఠారీ చెప్పారు.

గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ దాదాపు 2.3 బిలియన్‌ డాలర్ల విలువ చేసే రొయ్యలను అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసింది. అమెరికాకు మొత్తం సీఫుడ్‌ ఎగుమతుల్లో ఇది 90 శాతం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ఎగుమతులు ఉంటుండటంతో తెలుగువారిపైనా ఈ ప్రభావం పడొచ్చని అంచనా. ఈ విభాగంలో మనతో పోలిస్తే టారిఫ్‌లు తక్కువగా ఉన్న ఈక్విడార్‌తో పోటీ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే, బ్రిట న్‌తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా టారిఫ్‌ల ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫార్మా.. మెడికల్‌ డివైజ్‌లు.. 
చౌక జనరిక్స్‌ ఔష      ధాలకు సంబంధించి అమెరికా అవసరాల్లో దాదాపు 47 శాతాన్ని భారత్‌ తీరుస్తోంది. టారిఫ్‌లతో ఎగుమతులపై ప్రభావం పడితే భారత ఫార్మా సంస్థల లాభాలు తగ్గుతాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, కొత్త ఔషధాలకు అనుమతులు నిలిచిపోతాయని, అలాగే కొత్త ఆవిష్కరణలపై ఎఫెక్ట్‌ పడుతుందని భారతీయ మెడికల్‌ డివైజ్‌ల పరిశ్రమ సమాఖ్య ఏఐఎంఈడీ ఫోరం కోఆర్డినేటర్‌ రాజీవ్‌ నాథ్‌ తెలిపారు. అయితే, టారిఫ్‌లపరంగా చైనా, భారత్‌ మధ్య 15–20 శాతం మేర వ్యత్యాసం కొనసాగినంత కాలం మెడికల్‌ డివైజ్‌ల పరిశ్రమకు కాస్త సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.

ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు.. 
» గణాంకాల ప్రకారం అమెరికాకు ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. మన ఉత్పత్తులు ఖరీదుగా మారితే అమెరికన్లు మెక్సికోలాంటి దేశాలవైపు మళ్లొచ్చు. దీనితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలగవచ్చు.

వ్యవసాయ ఉత్పత్తులు.. 
»   అమెరికాకు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.6 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. సుంకాలతో భారత్‌ నుంచి ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయి, అమెరికన్లు దిగుమతులను తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మళ్లొచ్చు. దీనితో రైతులు, ఎగుమతిదార్లపై ప్రభావం పడొచ్చు. 

ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు.. 
అమెరికాకు ఈ ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్‌ డాలర్ల పైగా ఉన్నాయి. టారిఫ్‌లతో వల్ల వియత్నాం, బ్రెజిల్‌లాంటి దేశాలు పోటీకి రావడం వల్ల మన దగ్గర ఈ రంగంలోని బడా కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. 

మొత్తం ఎగుమతుల్లో అయిదో వంతు వాటాతో భారత్‌కు అమెరికా కీలకంగా ఉంటోంది. 
»  భారీగా ఉపాధి కల్పించే టెక్స్‌టైల్స్, వ్యవసాయం, లెదర్, రత్నాభరణాల్లాంటి పరిశ్రమల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 35 శాతంగా నమోదైంది. టారిఫ్‌లతో ఈ పరిశ్రమలు దెబ్బతింటే, ఉపాధి అవకాశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల పరిశ్రమలో 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా. 

»  గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్‌ 87 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 46 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్‌కు సుమారు 41 బిలియన్‌ డాలర్ల మేర మిగులు ఉంది. అటు సర్వీసులపరంగా చూసినా అమెరికాకు 2023లో 36.4 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు చేయగా, 34 బిలియన్‌ డాలర్ల దిగుమతులు చేసుకుంది. భారత్‌ పక్షాన సుమారు 2.4 బిలియన్‌ డాలర్ల మిగులు నమోదైంది. 

అమెరికన్లకూ ’చేదు’ మాత్రే .. 
అమెరికా టారిఫ్‌లు భారత్‌కి కొంత సమస్యాత్మకమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో వాటి ప్రభావం అమెరికన్లపైనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌ నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల, అక్కడ వాటి ధరలు పెరిగిపోయి స్థానికులు మరింతగా వెచ్చించాల్సి వస్తుందని ఫార్మా ఎగుమతి సంస్థల సమాఖ్య ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి తెలిపారు. భారీ ఎత్తున, నాణ్యమైన ఔషధాలను చౌకగా అందించే ప్రత్యామ్నాయాలను ఇప్పటికిప్పుడు దొరకపుచ్చుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుందని చెప్పారు.

ఏయే పరిశ్రమలకు ప్రతికూలం.. 
టెక్స్‌టైల్స్‌/దుస్తులు 
రత్నాభరణాలు 
ఫార్మా 
వాహనాలు, ఆటో విడిభాగాలు 
ఎల్రక్టానిక్స్‌/మొబైల్‌ డివైజ్‌లు 
ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు/మెటల్స్‌ 
సీఫుడ్‌/అగ్రి ఎగుమతులు

టెక్స్‌టైల్స్‌..
టారిఫ్‌ల వల్ల భారతీయ టెక్స్‌టైల్స్‌ ఎగుమతిదారులపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. మనతో పోలి స్తే వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలపై తక్కువ సుంకాలు ఉండటం వల్ల వాటి నుంచి మరింత పోటీని ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నా  రు. ఆర్డర్లు రద్దు కావడం, ధర లు తగ్గించాలంటూ ఒత్తిడి పెరగడంలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని ట్రేడ్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సైబెక్స్‌ ఎగ్జిమ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశా ల నుంచి పోటీ పెరిగి, చిన్న తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో బ్రిటన్, యూరోపియన్‌ యూనియన్, జపాన్‌లాంటి ఇతర మార్కెట్లపై కూడా మరింతగా దృష్టి పెట్టాలని భారతీయ టెక్స్‌టైల్‌ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) సెక్రటరీ జనరల్‌ చంద్రిమా చటర్జీ చెప్పారు. భారత టెక్స్‌టైల్స్, దుస్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. 17 బిలియన్‌ డాలర్ల రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతుల్లో 5.6 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. టెక్స్‌టైల్స్, అపారెల్‌ పరిశ్రమ ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ దెబ్బతింటే వీరి ఉపాధిపైనా ప్రభావం పడుతుంది.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ పరికరాలు.. 
టెలికం పరికరాలు, మొబైల్‌ ఫోన్స్, సర్క్యూట్‌ బోర్డుల్లాంటి ఉత్పత్తుల ఎగుమతులు 12 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. టారిఫ్‌ల వల్ల చౌకగా లభించే ఎలక్ట్రానిక్స్‌ విషయంలో మిగతా దేశాలతో భారత్‌ పోటీ పడే సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ఎల్రక్టానిక్స్‌ ఎగుమతులు నెమ్మదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement