బడ్జెట్ 2026:: వరాలు లేవు.. శరాలు లేవు.. | 80 Minutes Budget Full Details Here | Sakshi
Sakshi News home page

బడ్జెట్ 2026:: వరాలు లేవు.. శరాలు లేవు..

Feb 2 2026 7:54 AM | Updated on Feb 2 2026 8:34 AM

80 Minutes Budget Full Details Here

రెండో నెలలో నెల మొదటి రోజున మూడు ముఖ్యమైన కర్తవ్యాలతో కేవలం 4.3 శాతం ద్రవ్యలోటుతో 500 మంది పైగా పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఆర్థిక సుస్థిరతకు ఆరు సంస్కరణలతో 7 శాతం అభివృద్ధి ఉందంటూ 80 నిమిషాల్లో ఏకధాటిగా 9 వసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన పద్దు ఇది.

దీని పేరు యువ శక్తి బడ్జెట్‌. పవిత్ర మాఘ పౌర్ణమినాడు ఆదివారం అయినా ఆపకుండా విదేశీ మార్కెట్లతో పోటీపడుతూ, వికసిత్‌ భారత్‌ వైపుగా వడివడిగా అడుగులు వేస్తూ, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, ప్రజలను భాగస్వాములు చేస్తూ.. సబ్‌కా సాథ్‌ అంటూ, ఆత్మనిర్భర్‌ వైపుగా నిర్భయంగా అడుగులు వేస్తూ.. ఉత్పత్తి, సర్వీసులు, చిన్న తరహా పరిశ్రమలు, ఇన్‌ఫ్రా, ఫార్మా, జౌళి వివిధ రంగాలను ప్రస్తావిస్తూ, దివ్యాంగులను, యువతను మహిళలను, రైతులను, అన్ని రంగాలవారిని ఆకట్టుకుంటూ, టెక్నాలజీ ద్వారా కృత్రిమ మేధస్సు మిషన్, యోగా, ఆయుర్వేదం మొదలైన వాటికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, ఆటలను ప్రోత్సహిస్తూ, ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రస్తావిస్తూ సాగింది బడ్జెట్‌ ప్రసంగం.

ఎన్నికల తాయిలం లేదు. ప్రత్యేకిస్తూ కొన్ని రాష్ట్రాలకు పెద్ద పీట.. ఇంకొన్నింటిపై చిన్న చూపు చూడటంలాంటివి లేదు.. అభివృద్ధి మాత్రమే స్మరించారు. షేరు మార్కెట్‌ నష్టపోయింది కానీ .. పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యతిరేకతలు, నిరసనలు లేవు. అయితే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అంశానికొస్తే.. సంచలనాలు లేవు. రేటు మార్పులు లేవు. శ్లాబుల్లో మార్పులు లేవు, వేతన జీవులకంటూ ప్రత్యేకం లేదు. సీనియర్‌ సిటిజన్ల ప్రస్తావన లేదు. మహిళల ఊసే లేదు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ మారలేదు. 80సీ పరిమితిని పెంచలేదు. మరి ఏం ప్రపోజ్‌ చేశారు?

‘ఐ ప్రపోజ్‌’ అని వందసార్లకు పైగా చెప్పిన ఆర్థిక మంత్రి ఏం అన్నారంటే..

  • కొత్త చట్టం 01–04–2026 నుంచి అమల్లోకి వస్తోంది.

  • చట్టానికి చేదోడువాదోడుగా ఉండే రూల్సు వస్తాయి.

  • మీరు ప్రతి సంవత్సరం దాఖలు చేసే రిటర్నులు మారుతున్నాయి.

  • ఫారం డిజైన్‌ స్నేహపూర్వకంగా ఉంటుంది.

  • ‘నేను సైతం’ నా రిటర్ను వేసుకోగలను అనుకునేంత సులభతరంగా ఉంటుంది.

  • ఐటీఆర్‌ ఫారం 1,2లు వేయడానికి గడువు తేదీ జూలై 31.

  • మిగతా, అంటే ట్యాక్స్‌ ఆడిట్‌ అవసరం లేని వాటికి గడువు తేదీ ఆగస్టు 31.

  • మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ మీద వడ్డీ ఆదాయం లేదు. టీడీఎస్‌ ఉండదు.

  • టూర్‌ ప్రోగ్రామ్‌ల మీద, మ్యాన్‌పవర్‌ సర్వీస్‌ల మీద టీసీఎస్‌ రేటు తగ్గించారు (5 నుంచి 2 శాతానికి)

  • విదేశాలకు పంపే మొత్తాల మీద, అంటే విద్య, వైద్యం కోసం పంపే మొత్తాల మీద టీసీఎస్‌ని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది.

  • పన్ను తగ్గించి లేదా పూర్తిగా రద్దు చేయడానికి సంబంధించి టీడీఎస్‌ కోసం.. ఇక అధికారుల దగ్గరికి పరుగెత్తనక్కర్లేదు. అంతా ఆన్‌లైన్‌.

  • రివైజ్డ్‌ రిటర్నులకు గడువు తేదీని డిసెంబర్‌ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచారు.

  • విదేశాల్లో ఉన్నవారికి టీడీఎస్, క్యాపిటల్‌ గెయిన్స్‌ విషయంలో ఒకప్పుడు  TAN అవసరం. ఇప్పుడు PANతో సరి.

  • ఒక వర్గం వారు, విదేశీ ఆస్తుల డిక్లరేషన్‌ ఇవ్వాలి (వివరాలు రాయాలి).

  • అసెస్‌మెంట్‌ ద్వారా రివైజ్‌ వేయకూడదు కానీ ఇప్పుడు అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

  • ఇక నుంచి అండర్‌ రిపోర్టింగ్‌కి, మిస్‌–రిపోర్టింగ్‌కి ఒకేలా ఫెనాల్టీలు ఉంటాయి.

  • పెనాల్టీలను తక్కువ చేశారు (కొన్ని సందర్భాల్లో)

  • జైలు శిక్షలను తగ్గించారు (కొన్ని సందర్భాల్లో)

  • అకౌంట్‌ బుక్స్‌ ఇవ్వకపోయినా, టీడీఎస్‌కి సంబంధించిన కాగితాలు ఇవ్వకపోయినా ఏమీ అనరు.

  • నిజాయితీపరులైన ట్యాక్స్‌ పేయర్స్‌ తప్పులు చేసినా, ఫైన్‌తో వదిలేస్తారు.

  • పెద్దవి, పెను మార్పులు లేకపోయినా, కొన్ని మార్పులు మాత్రం వచ్చాయి. వాటిని స్వాగతిద్దాం.

ట్యాక్సేషన్‌ నిపుణులు: కే.సీహెచ్.ఎస్.వి.ఎన్. మూర్తి & కే.వీ.ఎన్. లావణ్య

Advertisement
 
Advertisement
Advertisement