కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు

US stocks rise ahead of midterm election results says experts - Sakshi

ఇందుకు ప్రపంచ సానుకూలతలు అవసరం

అంతర్జాతీయ పరిణామాలు కీలకమే

నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల

రూపాయి గమనం, క్రూడాయిల్‌ ధరలపై దృష్టి

మార్కెట్‌ కదలికలపై నిపుణుల అంచనాల

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే..,  ఈ వారం దేశీయ స్టాక్‌ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు.  

ట్రేడింగ్‌ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్‌ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి.

‘‘గతేడాది(2021) అక్టోబర్‌ 19న సెన్సెక్స్‌ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అన్మోల్‌ దాస్‌ తెలిపారు.
 
► ద్రవ్యోల్బణ డేటా దృష్టి
అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్‌ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్‌ ఆర్‌బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్‌ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. .  

► కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు  
దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్‌జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు  బయోకాన్, భారత్‌ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్‌సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్‌ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.

► ప్రపంచ పరిణామాలు  
అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్‌ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్‌ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్‌ అక్టోబర్‌ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్‌ ద్రవ్యోల్బణం, జపాన్‌ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.

ఎఫ్‌ఐఐలు వైఖరి  
ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్‌ఐఐలు తమ బుల్లిష్‌ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top