యూఎస్‌ మార్కెట్లు.. బౌన్స్‌బ్యాక్‌

US Market jumps on tech sector support - Sakshi

టెక్నాలజీ కౌంటర్ల దన్ను- మూడు రోజుల భారీ నష్టాలకు చెక్‌

డోజోన్స్‌ 440 పాయింట్లు అప్‌- 294 పాయింట్లు ఎగసిన నాస్‌డాక్‌

11 శాతం దూసుకెళ్లిన టెస్లా ఇంక్ 

మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ జోరు

మూడు రోజుల భారీ నష్టాలకు బుధవారం తెరపడింది. ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో యూఎస్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. వెరసి డోజోన్స్‌ జులై 14 తదుపరి అత్యధికంగా లాభపడింది. 440 పాయింట్లు(1.6%) పుంజుకుని 27,940 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ జూన్‌ 5 తరువాత 67 పాయింట్లు(2%) ఎగసి 3,399 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 294 పాయింట్లు(2.7%) జంప్‌చేసి 11,142 వద్ద స్థిరపడింది. తద్వారా ఏప్రిల్‌ 29 తరువాత సింగిల్‌ డేలో అధిక లాభాలు ఆర్జించింది. 

షార్ట్‌ కవరింగ్‌..
ఇటీవల వెల్లువెత్తిన అమ్మకాలతో మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనే నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10 శాతం కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా మార్కెట్లు రీబౌండ్‌ అయినట్లు తెలియజేశారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్‌-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్‌ కుదుర్చుకోకుండానే యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్‌) అంచనాల నేపథ్యంలో గత మూడు రోజులుగా మార్కెట్లు పతన బాటలో సాగుతూ వచ్చిన విషయం విదితమే. వీటికి జతగా టెక్నాలజీ దిగ్గజాల కౌంటర్లలో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ స్థాయిలో డెరివేటివ్‌ పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన వార్తలు కూడా ఒక్కసారిగా అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

జోరు తీరు
ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్‌ ఎకానమీ కౌంటర్లలో యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ 4 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. ఈ బాటలో గూగుల్‌ 1.6 శాతం, ఫేస్‌బుక్‌ 1 శాతం చొప్పున ఎగశాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్‌.. 11 శాతం దూసుకెళ్లింది. కంప్యూటర్‌ చిప్స్‌ తయారీ దిగ్గజం ఏఎండీ 4 శాతం పెరిగింది. క్లినికల్‌ పరీక్షలను తిరిగి వచ్చేవారం ప్రారంభించగలదన్న అంచనాలున్నప్పటికీ ఆస్ట్రాజెనెకా షేరు 2 శాతం క్షీణించింది. 16 బిలియన్‌ డాలర్లతో చేపట్టదలచిన టేకోవర్‌ను విరమించుకోనున్నట్లు లగ్జరీ గూడ్స్‌ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ వెల్లడించడంతో జ్యువెలరీ కంపెనీ టిఫనీ అండ్‌ కో 6.5 శాతం పతనమైంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top