
పెరుగుతున్న ప్రపంచ ఇంధన అనిశ్చితి, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌దేశానికి అతిపెద్ద ముడి చమురు, సహజ వాయువు సరఫరాదారుగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. భారత్ రష్యా ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) ఇంధన సదస్సులో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ జియాబింగ్ ఫెంగ్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.
ప్రధాన సరఫరాదారుగా మారేందుకు..
ఈ సదస్సులో ఫెంగ్ మాట్లాడుతూ..‘ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు మద్దతుగా భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. నాణ్యమైన ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవల ఎగుమతి ద్వారా మద్దతు ఇచ్చేందుకు అమెరికా కట్టుబడి ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశానికి ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్‌జీ) ప్రధాన సరఫరాదారుగా మారడానికి యూఎస్ ఎంతో ఆసక్తి చూపుతోంది’ అన్నారు.
దౌత్యపరమైన ఒత్తిడి
ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రష్యా చమురు దిగుమతులను తగ్గించాలని భారతదేశాన్ని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇటీవల దౌత్యపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సదస్సులోని ప్రకటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చమురు, గ్యాస్, అణుశక్తిపై సహకారంతో బలమైన ద్వైపాక్షిక ఇంధన భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి కలిసి రావాలని ఫెంగ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అమెరికా పర్యటనను హైలైట్ చేశారు. శిలాజ ఇంధనాలతో పాటు గ్రిడ్ ఆధునీకరణ, అణు ఇంధనం, అభివృద్ధి చెందుతున్న క్లీన్ టెక్నాలజీ రంగాల్లో కూడా భారత్‌తో భాగస్వామ్యం కావడానికి అమెరికా ఆసక్తిగా ఉంది. వీటిలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్లు), అధునాతన సహజ వాయువు మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ఇంధన భాగస్వామ్యాలు..
కీలకమైన ఖనిజాలను ఇరు దేశాలు సంయుక్తంగా భద్రపరచాలని, సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని పెంచాలని, అణువిద్యుత్, స్మార్ట్ గ్రిడ్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఐఏసీసీ రీజినల్ ప్రెసిడెంట్ అతుల్ చౌహాన్ సూచించారు. ఐఏసీసీలో క్లైమేట్ ఛేంజ్ అండ్ ఈఎస్‌జీ ఛైర్మన్ సునీల్ జైన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సమీకృత ఎనర్జీ భాగస్వామ్యాలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలకు అణు, ఎస్‌ఎంఆర్‌లతో సహా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సంప్రదాయ వనరులు కీలకంగా మారుతాయన్నారు.
ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్‌డేట్.. యూఐడీఏఐ లేఖ
అమెరికా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. టారిఫ్‌లకు భయపడి భారత్ డిమాండ్లకు ఒప్పుకుంటుందని భావించిన ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. భారత్ చౌకగా దిగుమతి చేసుకుంటున్న రష్యా చమురు స్థానంలో యూఎస్ క్రూడ్ దిగుమతులు పెంచాలని ఇటీవల ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.