
పిల్లల ఆధార్ అప్‌డేట్‌కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటన విడుదల చేసింది. 5-15 సంవత్సరాల వయసు గల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ దేశవ్యాప్తంగా పాఠశాలలకు పిలుపునిచ్చింది. పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న బయోమెట్రిక్ అప్‌డేట్‌లను పూర్తి చేయాలని కోరుతూ యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఎస్‌ఈ+) అప్లికేషన్‌లో పాఠశాల పిల్లల ఆధార్‌కు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్(ఎంబీయూ) స్టేటస్‌ను అందించడానికి పాఠశాల విద్య విభాగంతో యూఐడీఏఐ చేతులు కలిపింది. ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్‌లను సకాలంలో పూర్తి చేయడం ఐదేళ్ల వయసు వారికి, 15 ఏళ్ల వయసులో పిల్లలకు అవసరమని యూఐడీఏఐ నొక్కి చెప్పింది.
దాదాపు 17 కోట్ల ఆధార్ నంబర్ల విషయంలో తప్పనిసరి బయోమెట్రిక్స్ అప్‌డేట్ పెండింగ్‌లో ఉంది. పిల్లల బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి, నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ, విశ్వవిద్యాలయ పరీక్షల్లో నమోదు చేసుకోవడానికి అథెంటికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. యూఐడీఏఐ సీఈఓ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కూడా ఈ పరిస్థితి గురించి తన లేఖలో వివరించారు. ఎంబీయూ శిబిరాలను నిర్వహించడానికి ఆయా ప్రాంతాల మద్దతు కోరారు. ఈ శిబిరాలు పెండింగ్‌లో ఉన్న ఎంబీయూలను పూర్తి చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. అయితే ఈ శిబిరాలను పాఠశాలలు ఎప్పటిలోపు ఏర్పాటు చేయాలనే దానిపై సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర