ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు! | Urban consumers income levels remained unchanged | Sakshi
Sakshi News home page

ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు!

Apr 14 2025 9:11 AM | Updated on Apr 14 2025 9:13 AM

Urban consumers income levels remained unchanged

భారతదేశంలోని పట్టణ వినియోగదారుల ఆదాయాలకు, వారి ఖర్చులకు పొంతన లేకుండా ఉంది. ఖర్చులకు అనుగుణంగా తమ ఆదాయం పెరగ​కుండా స్తబ్దుగా  ఉండటంపై ఆందోళన చెందుతున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సర్వేలో వెల్లడైంది. అందులోని వివరాల ప్రకారం 55% పట్టణ నివాసితులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. ఇది దాదాపు 11 సంవత్సరాల్లో అత్యధిక వాటాను సూచిస్తుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ 80% మంది పట్టణ వినియోగదారులు నిత్యావసర వస్తువులపై చేస్తున్న ఖర్చు అధికంగా ఉందని పేర్కొన్నారు.

భవిష్యత్తు పొదుపు ప్రశ్నార్థకం

ఈ పరిస్థితి పట్టణ కుటుంబాలకు ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను హైలైట్‌ చేస్తుంది. ఆదాయం స్తబ్దుగా ఉండి ఖర్చులు పెరుగుతుండడంతో క్రమంగా అప్పుల్లో కురుకుపోతున్నారు. ద్రవ్యోల్బణ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర ఖర్చులు నిరంతరం పెరుగుతుండడం గమనార్హం. దాంతో చాలా మంది వినియోగదారులు తమ ఆర్థిక బడ్జెట్‌ను పునఃసమీక్షించుకోవలసి వస్తుంది. ఇది ప్రజల విచక్షణ వ్యయాన్ని(డిసిక్రీషనరీ స్పెండింగ్‌) తగ్గిస్తుంది. భవిష్యత్తు అవసరాలకు పెద్దగా పొదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

వేతన పెంపు లేదు

ఈ ధోరణికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, రంగాలవారీగా నెలకొన్న మందగమనాలు చాలా మంది వ్యక్తుల ఆదాయ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. తరచుగా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన ఉద్యోగులకు, సాలరీ ఇంక్రిమెంట్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపార యజమానులు సైతం స్థిరమైన ఆదాయ మార్గాలను నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం వ్యక్తిగతంగా కొన్ని ఇళ్లకు మాత్రమే పరిమితం కాదు. డిస్పోజబుల్ ఆదాయం(నెలవారీ ఖర్చుల అనంతరం మిగులు డబ్బు) తగ్గడంతో పట్టణ వినియోగదారులు నిత్యావసర వస్తువులు, ఇతర సేవలపై ఖర్చును నియంత్రించే అవకాశం ఉంది. ఇది రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, టూరిజం.. వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాక, వినియోగదారుల్లో ఖర్చుకు సంబంధించిన అప్రమత్తత వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది.

ఇదీ చదవండి: అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్‌

వ్యూహాత్మక చర్యలు అవసరం

ఈ ఆందోళనలను పరిష్కరించడానికి విధానకర్తలు ప్రధానంగా పట్టణ, గ్రామీణ వినియోగదారులకు మద్దతుగా నిలిచేందుకు వారితో కలిసి పనిచేయాలి. ఉపాధి అవకాశాలను పెంచడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలను ప్రవేశపెట్టడం వంటి వ్యూహాత్మక చర్యల్లో కొత్త విధానాలు రూపొందించి పక్కాగా అమలు చేయాలి. ఇవి వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, అవసరమైన ఆర్థిక ఉపశమనానికి సహాయపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement