
మే నెలలో రూ. 25.14 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పేద, ధనిక తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ అత్యంత చేరువైన యూపీఐ లావాదేవీలు గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 25.14 లక్షల కోట్లను తాకింది. 2024 మే నెలలో నమోదైన రూ. 20.44 లక్షల కోట్ల విలువైన లావాదేవీలతో పోలిస్తే వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదైంది.
అంతక్రితం నెల అంటే ఈ ఏప్రిల్‌లో నమోదైన రూ. 23.94 లక్షల కోట్లతో చూసినా వీటి విలువ 5 శాతం ఎగసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలివి. పరిమాణంలోనూ లావాదేవీల సంఖ్య 1,789.3 కోట్ల నుంచి 1,867.7 కోట్లకు పెరిగింది. కాగా..రోజువారీ లావాదేవీల విలువ ఈ ఏప్రిల్‌తో చూస్తే రూ. 79,831 కోట్ల నుంచి రూ. 81,106 కోట్లకు బలపడింది.