నిరుద్యోగ రేటు 12.6 శాతం

Unemployment rate at 12. 6percent in April-June 2021 - Sakshi

2021 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం గణాంకాలు

విడుదల చేసిన ఎన్‌ఎస్‌వో

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ రేటు పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) 12.6 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగ రేటు కరోనా కారణంగా 20.8 శాతానికి పెరిగిపోవడంతో.. అక్కడి నుంచి తగ్గినట్టు కనిపిస్తోంది. ‘11వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) గణాంకాలను తాజాగా జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసింది. పనిచేయగలిగి ఉండి, ఉపాధి లేకుండా ఉన్న వారిని నిరుద్యోగ రేటు కింద పరిగణిస్తారు. 2020 ఏప్రిల్‌–జూన్‌ కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో లాక్‌డౌన్‌లు అమలు చేయడం వల్ల అప్పుడు నిరుద్యోగ రేటు గణనీయంగా పెరగడం గమనార్హం. 15 ఏళ్లు అంతకుమించి వయసులోని వారిని ఈ గణాంకాల కిందకు ఎన్‌ఎస్‌వో పరిగణనలోకి తీసుకుంటోంది.

గణాంకాలు వివరంగా..  
► పట్టణాల్లో మహిళల నిరుద్యోగ రేటు 2020 ఏప్రిల్‌ – జూన్‌ కాలంలో 21.1 శాతంగా ఉంటే, 2021 ఏప్రిల్‌–జూన్‌ కాలానికి 14.3 శాతానికి దిగొచ్చింది. కానీ అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరిగింది. 2021 జనవరి–మార్చిలో ఇది 11.8 శాతంగా ఉంది.  
► పురుషుల్లో ఈ రేటు 20.7 శాతం నుంచి 12.2 శాతానికి తగ్గింది. 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 9.6 శాతంగా ఉండడం గమనార్హం.  
► కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 2021 ఏప్రిల్‌–జూన్‌ కాలానికి 46.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది ఉన్న 45.9 శాతంతో చూస్తే స్వల్పంగా పెరిగింది. అంటే ఈ మేరకు పనిచేసే మానవవనరులు పెరిగినట్టు అర్థం చేసుకోవాలి. కానీ 2021 జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 47.5 శాతంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top