ఇంత కంటే చీప్‌ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..

UK council selling Grade 2 listed flats worth 640,000 gbp for just 1 gbp - Sakshi

UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. 

లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్‌లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్‌లను 1 పౌండ్‌ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్‌గార్డ్ ఫ్లాట్‌లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్‌వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్‌ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది.

డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్‌లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్‌లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది.

(Flipkart New Feature: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్‌!)

అధిక సంఖ్యలో హాలిడే హోమ్‌లు ఉండే ఇంగ్లాండ్‌లో సెకండ్ హోమ్‌లు, హాలిడే హోమ్‌ల సమస్య కార్న్‌వాల్‌లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్‌లు ఉన్నట్లుగా కార్న్‌వాల్ లైవ్ నివేదించింది.

కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది.

అర్హతలు ఇవే..
ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్‌ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్‌ క్యాబినెట్‌ సభ్యుడు, కౌన్సిలర్‌ రాండీ కాంటే పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top