మైక్రోసాఫ్ట్, యాక్టివిజన్‌ డీల్‌కు బ్రేకులు | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్, యాక్టివిజన్‌ డీల్‌కు బ్రేకులు

Published Thu, Apr 27 2023 4:21 AM

UK blocks Microsoft Activision Blizzard acquisition  - Sakshi

లండన్‌: వీడియో గేమ్‌ల తయారీ సంస్థ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసే ప్రతిపాదనకు బ్రిటన్‌ బ్రేకులు వేసింది. క్లౌడ్‌ గేమింగ్‌ మార్కెట్‌లో పోటీని ఈ డీల్‌ దెబ్బ తీసే అవకాశం ఉందని భావించడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే విలీన ఒప్పందాన్ని ఆమోదించకుండా ఉండటం ఒక్కటే పరిష్కార మార్గమని కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ తన తుది నివేదికలో పేర్కొంది. మరోవైపు బ్రిటన్‌ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

టెక్నాలజీ రంగంలో నవకల్పనలకు, పెట్టుబడులకు ఇలాంటివి విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. తాము ఇప్పటికీ యాక్టివిజన్‌ డీల్‌కు కట్టుబడి ఉన్నామని, దీనిపై అప్పీలు చేసుకుంటామని వివరించింది.  గేమింగ్‌ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయిలో 69 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌ను పూర్తి నగదు రూపంలో మైక్రోసాఫ్ట్‌ ప్రతిపాదిస్తోంది. అయితే, పోటీని దెబ్బతీసేలా కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి పాపులర్‌ గేమ్‌లపై మైక్రోసాఫ్ట్‌ గుత్తాధిపత్యం దక్కించుకుంటుందనే ఉద్దేశంతో అమెరికా, యూరప్‌ దేశాల నియంత్రణ సంస్థలు ఈ ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. సోనీ తదితర ప్రత్యర్థి సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement