సాక్షి,న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం బ్యాంక్ ఉద్యోగ, అధికారి సంఘాల వేదికైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్తంగా మరోసారి సమ్మెకు పిలుపునిచ్చింది.
ఈ నెల (సెప్టెంబర్) 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. శని, ఆదివారాలు రెండు రోజులు సెలవు ప్రకటించి, దానికి బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పనివేళలను మరో 40 నిమిషాలు పెంచాలని గతంలోనే ప్రతిపాదించినా ఆమోదం పొందలేదు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, సెప్టెంబర్ 11వ తేదీ నాటి సమ్మె కొనసాగింపుగా ఈ మూడు రోజుల సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్లు స్పష్టం చేశాయి. ఒకవేళ అప్పటికీ డిమాండ్లు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించాయి.
ఎస్‌బీఐ ఖాతాదారులకు సూచనలు
ఈ దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ తన ఖాతాదారులకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. సమ్మె కారణంగా బ్యాంక్ శాఖల్లో భౌతిక కార్యకలాపాలు, నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపింది.
ఖాతాదారులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని సూచించింది. అత్యవసరమైన బ్యాంకు పనులు లేదా నగదు అవసరాలను సమ్మె తేదీలకు ముందే పూర్తి చేసుకోవాలని కోరింది. రొటీన్ లావాదేవీల కోసం ఏటీఎంలు , క్యాష్ డిపాజిట్ మెషిన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో , మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.


