
వచ్చే 2–3 త్రైమాసికాల్లో పుంజుకుంటుంది
యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా
ముంబై: భారత్‌లో గృహ వినియోగం వచ్చే రెండు నుంచి మూడు త్రైమాసికాల్లో పుంజుకుంటుందని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలపడుతుండడం మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇది కొనుగోలు శక్తిని పెంచుతుందని తెలిపింది. అలాగే మంచి వర్షపాతం అంచనాలు పంటల దిగుబడిపై ఆశలను పెంచుతున్నాయని, మహిళల సామాజిక భద్రతపై ప్రభుత్వాలు 20 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుండడం.. ఇవన్నీ గ్రామీణ వినియోగాన్ని బలోపేతం చేస్తాయని తన నివేదికలో యూబీఎస్ సెక్యూరిటీస్ వివరించింది.
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, వ్యక్తిగత ఆదాయపన్నులో మార్పుల ద్వారా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం, రుణాల లభ్యత పెరగడం.. ఇవన్నీ పట్టణ వినియోగాన్ని కుదురుకునేలా చేస్తాయని తెలిపింది. ‘‘గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ.. మొత్తం వాటాలో గ్రామీణ వినియోగం సగానికంటే తక్కువగా ఉన్నందున, గృహ వినియోగం అన్ని రకాలుగా కోలుకుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. గ్రామీణ వినియోగం క్రమంగా బలపడుతున్న కొద్దీ ఎంతలేదన్నా వచ్చే 2–3 త్రైమాసికాల్లో గృహ వినియోగం పుంజుకోవడం మొదలవుతుంది’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ భారత ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్ తెలిపారు.
మాస్ మార్కెట్లో స్తబ్దత
గ్రామీణ మార్కెట్లలో చౌక ఉత్పత్తుల వినియోగంలో స్తబ్దత నెలకొనగా, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నట్టు యూబీఎస్ సెక్యూరిటీస్ వెల్లడించింది. గ్రామీణ వేతనాల్లో వృద్ధి (ఆహార ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) ఆరేళ్ల గరిష్ట స్థాయి అయిన 4.5 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 9 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 35 శాతం చొప్పున పెరిగినట్టు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు, డ్యూరబుల్స్ గూడ్స్ ఉత్పత్తి మాత్రం జూన్ త్రైమాసికంలో తగ్గినట్టు తెలిపింది. ఎనిమిదో వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా 2026 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 55 బిలియన్ డాలర్ల చెల్లింపులు మొదలైతే అప్పుడు పట్టణ డిమాండ్ సైతం ఊపందుకుంటుందని అంచనా వేసింది.