కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధిదారులకు అందించే క్యాష్‌లెస్ వైద్య సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్‌ఏ) ప్రకటించింది.
క్లెయిమ్‌ల తిరస్కరణ, చెల్లింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా కోతలు విధించడం, తీవ్రమైన జాప్యం, ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రులను ప్యానెల్ నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీష్ దొడేజాకు టీఎస్‌హెచ్‌ఏ లేఖ ద్వారా నోటీసు పంపింది.
వివిధ సమస్యలపై సంస్థతో చర్చించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలందింపు కష్టంగా మారడంతోనే క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఇకపై రీయింబర్స్‌మెంట్ పద్ధతిలోనే వైద్య సేవలు పొందవచ్చని సూచించారు.


