ఇంటికి, వ్యాపారానికి బీమా ధీమా | Insurance coverage for home and business | Sakshi
Sakshi News home page

ఇంటికి, వ్యాపారానికి బీమా ధీమా

May 11 2026 4:33 AM | Updated on May 11 2026 8:03 AM

Insurance coverage for home and business

ప్రమాదాలనేవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అవి ముందస్తు సమాచారం లేకుండానే విరుచుకుపడతాయి. సుదీర్ఘంగా కురిసే వర్షాలు ఇళ్లను ముంచెత్తవచ్చు. ఒక చిన్న అగ్ని ప్రమాదం ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే బూడిద చేయవచ్చు. అంతంత మాత్రం ఆదాయాలతో నడిచే కుటుంబాలకు, చిన్న వ్యాపారాలకు ఇవి అప్పుడప్పుడు ఎదురయ్యే అరుదైన సంఘటనలు కావు.నిత్యం ఎదురయ్యే చేదు నిజాలు. 

ఇలాంటి పరిస్థితుల్లో బీమా అనేది ఆర్థికంగా ఆసరాగా నిలిచేది అయినప్పటికీ దేశీయంగా దీని వినియోగం ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉంటోంది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023–24లో జీడీపీలో బీమా వాటా కేవలం 3.7 శాతమే. అంతక్రితం ఏడాదిలో నమోదైన 4% కన్నా ఇది తక్కువ కావడంతో పాటు ప్రపంచ సగటు 7% కన్నా చాలా తక్కువ కావడం గమనార్హం. ఇక ఇందులో జనరల్‌ బీమా వాటా కేవలం 1% మాత్రమే. అసెట్స్‌ వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రాపర్టీ, వ్యాపారాల రిస్కులకు కవరేజీ అత్యంత తక్కువగా ఉండటాన్ని ఇది సూచిస్తోంది.  

దేశ జీడీపీలో సుమారు 30%, ఎగుమతుల్లో 45% వాటా ఉండే ఎంఎస్‌ఎంఈ రంగంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రిటైలర్లు, ఫ్యాబ్రికేషన్‌ యూనిట్లు, లాజిస్టిక్స్, రిపేర్‌ వర్క్‌షాప్‌ల లాంటి వ్యాపారాల్లో  ప్రమాదం జరిగితే నెలల తరబడి పనులు ఆగిపోతాయి. ఇది వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది.  వాటిని అధిగమించేందుకే ‘బిజినెస్‌ ఇంటరప్షన్‌ ఇన్సూరెన్స్‌’ రూపొందింది.  

ఇక గృహాల విషయానికొస్తే వాతావరణ సంబంధ రిస్క్ లు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉంటోంది. వరదలు, తుఫాన్లు, వడగాల్పుల ప్రభావం భారత్‌లో ఎక్కువగా ఉంటుందని, తగిన భద్రత వ్యవస్థలు లేకపోతే వాతావరణ షాక్‌ల వల్ల కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే ముప్పు ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఆదాయాలు, గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ స్టాండెలోన్‌ హోమ్‌ ఇన్సూరెన్స్‌ వినియోగం ప్రధాన మెట్రో నగరాల వెలుపల ఇప్పటికీ తక్కువే. అయితే, క్రమంగా ఈ ధోరణి మారుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు అంతక్రితం ఏడాది కన్నా రెండంకెల స్థాయి వృద్ధితో రూ. 2.9 లక్షల కోట్ల స్థూల ప్రీమియం వసూళ్లను నమోదు చేయడం ఇందుకు నిదర్శనం.  

సరళతరంగా ఇన్సూరెన్స్‌.. 
రుణదాతలు, రిస్క్‌ కవరేజీని తప్పనిసరి చేస్తుండటంతో ప్రాపర్టీ, కమర్షియల్‌ ఇన్సూరెన్స్‌ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. పరిశ్రమ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతోంది. పాలసీ పరిభాష సరళతరంగా మారింది. డిజిటల్‌గా జారీ వల్ల టర్నెరౌండ్‌ సమయం తగ్గింది. క్లెయిమ్స్‌ని రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేయడం వీలవుతోంది. క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ పనితీరు కూడా చాలా మెరుగుపడింది. ఇవన్నీ కూడా బీమా విస్తృతి పెరిగేందుకు దోహదపడుతున్నాయి.  

తక్కువ ప్రీమియంతో లభించే మైక్రో–ఇన్సూరెన్స్‌ పద్ధతులు చిన్న వ్యాపారాలకు మరియు సామాన్యులకు బీమాను చేరువ చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా విపత్తులు సంభవించే ప్రాంతాల్లో అప్పుల పాలు కాకుండా ప్రజలను కాపాడుతుంది. బీమా ఉన్న వ్యాపారాలు త్వరగా కోలుకోవడం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినదు, ఉపాధికి విఘాతం కలగదు. ఈ రకంగా బీమా అనేది ఆర్థిక వ్యవస్థకు ఒక ’షాక్‌ అబ్జార్బర్‌’ లాగా పనిచేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాల తీవ్రత పెరగవచ్చు. ఈ నేపథ్యంలో జనరల్‌ ఇన్సూరెన్స్‌ అనేది అదనపు ఖర్చు కాదు,  రక్షణ కవచం. భారత ఆర్థిక వృద్ధిలో రిస్క్‌ ప్రొటెక్షన్‌ను భాగం చేయ డం అనేది ముందుజాగ్రత్త మాత్రమే కాదు, ఆర్థిక అవసరం కూడా.

రమిత్‌ గోయల్‌

చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్, జనరలి సెంట్రల్‌ ఇన్సూరెన్స్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement