మీ ఫ్యామిలీకి బీమా ఎంత?  | Medical auditing is an essential part of the healthcare industry | Sakshi
Sakshi News home page

మీ ఫ్యామిలీకి బీమా ఎంత? 

Jun 1 2026 12:49 AM | Updated on Jun 1 2026 12:49 AM

Medical auditing is an essential part of the healthcare industry

ఆరోగ్య బీమా.. ఆడిట్‌కు పదండి

ప్రతి కుటుంబం అవసరాలు ఒకేలా ఉండవు

కుటుంబ సభ్యులు, ఆరోగ్య అవసరాలు వేర్వేరు

ఎంపిక తమ అవసరాలను తీర్చేదిగా ఉండాలి

అవసర యాడ్‌ ఆన్‌లతో ప్రీమియం భారం

అవసరమైన వాటికే ప్రాధాన్యం

తద్వారా భరోసా పాటు బడ్జెట్‌ ఆదా  

ఒకప్పుడు బైపాస్‌ సర్జరీ రూ.1.5 లక్షలకే పూర్తయ్యేది. ఇపుడైతే రూ.3–5 లక్షలు కూడా చాలని పరిస్థితి. అవయవ మార్పిడి చికిత్సకు వెళ్లాల్సి వస్తే రూ.20–30 లక్షలు ఖర్చుచేయక తప్పదు. ఇక సర్జరీ తర్వాత సమస్యలు తలెత్తితే బిల్లు ఏ స్థాయికి పోతుందో ఊహించటమే కష్టం. స్టేజ్‌ను బట్టి, చికిత్సను బట్టి క్యాన్సర్‌కు రూ.కోటి కూడా దాటిపోతున్న రోజులివి. కాబట్టి ఎప్పుడో కొనుగోలు చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్, జీవితాంతం భరోసా ఇస్తుందనుకోవటం కరెక్టు కాదు.

 కుటుంబ ఆరోగ్య సంరక్షణ అవసరాలు వయసుతోపాటే పెరుగుతూ పోతాయి. కొన్నేళ్ల క్రితం కవరేజీ, సదుపాయాల పరంగా మెరుగ్గా అనిపించిన పాలసీ.. ఇప్పటి వైద్య ద్రవ్యోల్బణాన్ని (పెరిగే చార్జీలు), కుటుంబ అవసరాలను తట్టుకోలేకపోవచ్చు. అత్యాధునిక చికిత్సలకు కవరేజీని ఆఫర్‌ చేయకపోవచ్చు. అందుకే ప్రతి కుటుంబానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆడిట్‌ తప్పనిసరి. ఆటో రెన్యువల్‌ ఆఫ్‌ చేయండి. ఒక్కసారి ఫోకస్‌ లైట్‌ వేసి చూడండి.    

ఇప్పటికే ఉన్న రక్షణ ఎంత? 
ముందుగా కుటుంబానికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఒక్కచోటకు చేర్చి, సమగ్రంగా పరిశీలించుకోవాలి. చాలా కుటుంబాల్లో ఒకటి కంటే ఎక్కువ పాలసీలుంటాయి. కానీ, వాటి సదుపాయాల గురించి పెద్దగా గుర్తుండదు. కొన్ని కుటుంబాలకు ఒక్క పాలసీ కూడా ఉండదు.  
→ వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు 
→ ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్లు 
→ కంపెనీలు ఉద్యోగులకు అందించే గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌  
→ టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ ప్లాన్లు 
→ సీనియర్‌ సిటిజన్‌ హెల్త్‌ పాలసీలు 
→ పాలసీలకు ఉన్న యాడ్‌ ఆన్‌లు, రైడర్లు

కుటుంబానికి అసలు ఎంత కవరేజీ కావాలి? 
అన్ని కుటుంబాలకు ఒకే రకమైన ఆరోగ్య బీమా కవరేజీ (సమ్‌ ఇన్సూర్డ్‌) అర్థవంతంగా ఉండదు. తమ కుటుంబ వాస్తవ పరిస్థితుల ఆధారంగానే కవరేజీ, సదుపాయాలను ఎంపిక చేసుకోవాలి. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? ఎంత తరచుగా వైద్యసాయం అవసరమవుతుంది? అత్యవసర వైద్యానికి ప్రస్తుత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ భరోసానిస్తుందా? అన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా, మీ కుటుంబ వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎంత కవరేజీ అవసరమో లెక్కించాలి. 
→ కుటుంబ సభ్యుల వయసుకు ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి. 
→ ప్రస్తుతం బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనాఉన్నాయా? 
→ చికిత్స అవసరం పడితే మీరు నివసించే ప్రాంతంలో లేదా నగరంలోని ఏ హాస్పిటల్స్‌కు వెళ్లడానికి ప్రాధాన్యం చూపిస్తారు? అక్కడ వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయో విచారించాలి. మీరు నివసించే ప్రాంతం జోన్‌ ఆధారంగా ప్రీమియాన్ని కంపెనీలు నిర్ణయిస్తుంటాయి. ఒక జోన్‌ పరిధిలో పాలసీ తీసుకుని, ఇంకో జోన్‌లో చికిత్స తీసుకుంటే కొంత మొత్తాన్ని సొంతంగా (కోపేమెంట్‌) చెల్లించుకోవాల్సి వస్తుంది.   
→ మీకు నచ్చిన హాస్పిటల్స్‌ ఇన్సూరెన్స్‌ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నాయా? 
→ ప్రసవ ఖర్చులు (మెటర్నిటీ), చిన్న పిల్లల సంరక్షణ లేదా వృద్ధుల చికిత్స అవసరాలు ఉన్నాయా? వీటిల్లో మీ అవసరాలు ఏవన్నవి 
నిర్ణయించుకోవాలి.

ప్రీమియం చెక్‌ చేసుకోండి.. 
ఆన్‌లైన్‌ ప్రీమియం క్యాలిక్యులేటర్ల సాయంతో ఏ నిర్ణయమైనా సులభంగా తీసుకోవచ్చు. జేబు నుంచి డబ్బులు పెట్టకుండానే ఏ ప్లాన్‌కు ఎంత ఖర్చవుతుందో వీటితో సులభంగా తెలుసుకోవచ్చు. 
→ వ్యక్తిగత పాలసీ తీసుకోవాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్‌ నయమా? 
→ బేసిక్‌ ఇండెమ్నిటీ పాలసీ కవరేజీ (సమ్‌ ఇన్సూర్డ్‌) పెంచితే ప్రీమియం ఎంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది? 
→ బేసిక్‌ ప్లాన్‌ తక్కువగా ఉంచి, దానికి సూపర్‌ టాపప్‌ జోడిస్తే ప్రీమియం ఎంత ఆదా అవుతుంది? ఎందుకంటే సాధారణంగా బేసిక్‌ ప్లాన్‌ సమ్‌ ఇన్సూర్డ్‌ను పెంచడం కంటే అదనపు కవరేజీతో సూపర్‌ టాపప్‌ జోడించుకోవడం చాలా చౌక మార్గం.  

పాలసీ లోపాలు – అదనపు ఖర్చులు 
ఈ ఆడిట్‌ వల్ల మీ పాలసీలో ఉన్న లోపాలను గుర్తించొచ్చు. అనవసరమైన వాటికి డబ్బులు చెల్లించకుండా చూసుకోవచ్చు.  

పాలసీ లోపాలు      
→ రూమ్‌ రెంట్‌ పరిమితులు: మీ పాలసీలో రూమ్‌ రెంట్‌పై పరిమితి ఉంటే, క్లెయిమ్‌ సమయంలో మీ బిల్లులో చాలా కోత పడుతుంది. ఉదాహరణకు షేర్డ్‌ రూమ్‌ అనే క్లాజ్‌ ఉందనుకుందాం. ఆస్పత్రిలో చేరినప్పుడు సింగిల్‌ రూమ్‌ వసతి పొందితే బిల్లులో భారీ తేడా వస్తుంది. షేర్డ్‌ రూమ్‌లో అందించే చికిత్సల చార్జీలు, సింగిల్‌ రూమ్‌ కంటే తక్కువగా ఉంటాయి. కనుక సింగిల్‌ రూమ్‌లో చేరడం కారణంగా ఎంత వ్యత్యాసం వచ్చిందో అంతమేర బిల్లు నుంచి బీమా కంపెనీలు తెగ్గోస్తాయి.      

→ కో–పేమెంట్‌ క్లాజ్‌: క్లెయిమ్‌ మొత్తంలో మీ జేబు నుంచి పెట్టుకోవడం. ఉదాహరణకు 20 శాతం కోపేమెంట్‌ నిబంధన ఉంటే.. రూ.5 లక్షల బిల్లులో రూ.లక్ష పాలసీదారుడు సొంతంగా చెల్లించుకోవాలి.      
→ వెయిటింగ్‌ పీరియడ్‌: పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధుల కవరేజీకి ఎంత కాలం పాటు వేచి ఉండాలన్నది ఇందులో ఉంటుంది.      
→ వ్యాధుల వారీ పరిమితులు: వ్యాధుల వారీ చెల్లింపుల పరిమితుల్లేకుండా చూసుకోవాలి. అ లాగే టెక్నాలజీ సాయంతో చాలా చికిత్సలను వేగంగా కానిచ్చేస్తున్నారు. దీంతో రోగి కొన్ని గంటల పాటు ఆస్పత్రిలో ఉంటే సరిపోతుంది. వీటిని డేకేర్‌ ప్రొసీజర్స్‌గా పేర్కొంటారు. కనుక మీ ప్లాన్‌లో డేకేర్‌ ప్రొసీజర్స్‌ అన్నింటికీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి.  
→ రీస్టోరేషన్‌: మీ ప్లాన్‌లో రీస్టోరేషన్‌ కూడా ఉండాలి. ఒక ఏడాదిలో సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తం ఖర్చయిపోతే, తిరిగి మళ్లీ అంతే మొత్తం దీనికింద బీమా సంస్థ పునరుద్ధరిస్తుంటుంది. అపరిమిత రీస్టోరేషన్‌ ఫీచర్‌నూ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి.  
→ ప్రీ– అండ్‌ పోస్ట్‌–హాస్పిటలైజేషన్‌: ఆస్పత్రిలో చేరడానికి ముందు, డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఎన్ని రోజులకు చెల్లింపులు చేస్తుందో తెలుసుకోవాలి. 

అదనపు ఖర్చులు 
→ డూప్లికేట్‌ కవరేజీ: పనిచేసే కంపెనీ ఇచ్చే గ్రూప్‌ హెల్త్‌ప్లాన్‌ అన్నింటికీ సరిపోతుంటే, విడిగా అదే రకమైన పాలసీపై అనవసరంగా ఖర్చు చేస్తున్నారా? ఒక్కసారి గమనించండి. కంపెనీ ఆఫర్‌ చేసినా, విడిగా కుటుంబానికి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ కచ్చితంగా ఉండాలి. కనుక పనిచేసే సంస్థ నుంచి బీమా కవరేజీ పొందుతుంటే.. అందులో లేని సదుపాయాలతో కూడిన ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ను రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవచ్చు.  
→ అనవసర యాడ్‌ ఆన్‌లు: గతంలో ఎప్పుడో తీసుకున్న మెటర్నిటీ రైడర్‌ ఇప్పుడు అవసరం లేకపోయినా ప్రీమియం కడుతున్నారా? అలాగే, అవసరం లేని యాడాన్‌ ఇంకేవైనా ఉన్నాయా? 
→ సరైన ప్లాన్‌ లేకపోవడం: వృద్ధులైన తల్లిదండ్రులను ఫ్యామిలీ ఫ్లోటర్‌లో ఉంచడం వల్ల ప్రీ మియం భారం పెరుగుతుంటే, వారిని విడి గా సీనియర్‌ సిటిజన్‌ ప్లాన్‌లోకి మార్చాలి. దీనివల్ల ప్రీమియం ఎంతో ఆదా అవుతుంది.  

క్లెయిమ్‌ సాఫీగా.. 
సదుపాయాలు, ప్రీమియం పరంగా పాలసీ ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ.. అవసరానికి నగదు రహిత చికిత్స అందించలేకపోతే వృథా. కనుక ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలి.  
→ బీమా సంస్థ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో ఎలా ఉంది?  
→ డిజిటల్‌ రూపంలో క్లెయిమ్‌ సపోర్ట్, కస్టమర్‌ కేర్‌ సేవలు సరిగ్గా అందుతున్నాయా?  
→ క్లెయిమ్‌ ప్రాసెస్‌ సులభంగా, వేగంగా ఉందా?  
→ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ జాబితా పెద్దదేనా? నగదు రహిత చికిత్సలను సులభంగా లభిస్తున్నాయా?

ఆచరణ.. 
ఆడిట్‌ పూర్తయ్యాక, రాబోయే రెన్యువల్‌ సమయంలో కింది మార్పులు చేసుకోండి. 
→ ప్రస్తుత ప్లాన్‌ను కవరేజీ చాలదనుకుంటే సూపర్‌ టాపప్‌ జోడించుకోండి. ఇప్పటికే ఉన్న సమ్‌ ఇన్సూర్డ్‌ను డిడక్టబుల్‌గా ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు రూ.5 లక్షలకు సమ్‌ ఇన్సూర్డ్‌తో ప్లాన్‌ ఉంటే, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.25– 50– 100 లక్షలకు సూపర్‌ టాపప్‌ను చాలా తక్కువ ప్రీమియంకే సొంతం చేసుకోవచ్చు. 
→ అనవవసరమైన యాడాన్‌లను రద్దు చేసుకోండి. 
→ ముఖ్యంగా పాలసీ వర్డింగ్స్‌ డాక్యుమెంట్‌ను ఆసాంతం చదివి అందులోని కవరేజీ ఆప్షన్లు, మినహాయింపులు ఏవైనా ఉంటే అవగాహన తెచ్చుకోవాలి. లేని కవరేజీలను యాడాన్‌ రూపంలో జోడించుకోవచ్చేమో చూడండి.  
→ ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, రెన్యువల్‌ సమయంలో పోర్టింగ్‌ ద్వారా మరొక బీమా కంపెనీ ప్లాన్‌లోకి మారిపోవచ్చు.

గుర్తు పెట్టుకోండి.. 
ఇన్సూరెన్స్‌ ఆడిట్‌ అనేది కనీసం ప్రతి ఐదేళ్లకు ఒకసారైనా అవసరం. అప్పుడే మారుతున్న వైద్య ఖర్చులకు, మీ కుటుంబ అవసరాలకు తగినట్లుగా మీ పాలసీ అప్‌డేట్‌గా ఉంటుంది. ఆటో–రెన్యువల్స్‌ జోలికి వెళ్లకుండా, ప్రీమియం క్యాలిక్యులేటర్‌ సాయంతో సరైన ప్లాన్‌ ఎంచుకుని మీ కుటుంబానికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించుకోండి.

– సాక్షి, వెల్త్‌

Advertisement
 
Advertisement
Advertisement