breaking news
family health and wealth
-
ఆరోగ్య బీమా.. ఆదుకునే నేస్తం
క్రాంతి (40) ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మెరుగైన ప్యాకేజీ కోసం మారాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాతే, మెరుగైన ప్యాకేజీ ఎందుకిచ్చారో అతడికి బోధపడింది. ఉదయం 7 గంటలకు వెళితే రాత్రి ఇంటికొచ్చేసరికి 10 అవుతోంది. ‘మనకొద్దురా బాబూ ఈ జాబు’ అనుకుని ఉన్నట్టుండి రాజీనామా ఇచ్చేశాడు. మరో కంపెనీలో ఉద్యోగం కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. కానీ, దురదృష్టం ప్రమాదం రూపంలో ఎదురైంది. బైక్‌పై వెళుతున్న సమయంలో ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. కాలికి, చేతికి ప్లేట్లు వేయాల్సి వచ్చింది. ఆసుపత్రి బిల్లు సుమారు రూ.4 లక్షలు వచ్చింది. ఈ మొత్తాన్ని అతడు క్రెడిట్ కార్డుపై సర్దుబాటు చేయాల్సి వచ్చింది. కారణం పాత కంపెనీలో ఉన్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ.. రాజీనామా ఇచ్చిన నెలతోనే ముగిసిపోయింది. అది తప్ప అతడికి మరో ప్లాన్ లేదు. ఈ చిన్న తప్పిదం అతడి మూడేళ్ల పొదుపు సొమ్మును పట్టుకుపోయింది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పనిచేస్తున్న కంపెనీలపై ఆధారపడకుండా, తమకంటూ మెరుగైన కవరేజీతో రక్షణ కల్పించుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మనిషి ప్రాణాలను కాపాడే విషయంలో, ఆయువును పెంచడంలో వైద్య రంగం ఎంతో ప్రగతి సాధించింది. కానీ, ఇందుకు అదనపు ఖర్చు అవుతుంది. నేడు జీవన శైలి వ్యాధులు పెరిగిపోయాయి. కేన్సర్ మహమ్మారి మన సమాజంలో వేగంగా విస్తరిస్తోంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాలు, లివర్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ మారిన జీవనశైలి కారణంగా ప్రబలుతున్నవే. వీటికయ్యే వ్యయం సామాన్యులు, మధ్య తరగతి ప్రజల వల్ల అయ్యే పనికాదు. పైగా ఏటేటా వైద్య చికిత్సల వ్యయాలు 10–15 శాతం మేర భారమవుతున్నాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏటా కొంత ప్రీమియం చెల్లించడం ద్వారా కుటుంబం అంతటికీ రక్షణ కల్పించుకోవచ్చు. ఏటా తమ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం రూపంలో చెల్లించడం అసాధ్యమేమీ కాదు. కానీ, ఆరోగ్య సమస్య లేదా ప్రమాదం కారణంగా హాస్పిటల్లోచేరితే వచ్చే బిల్లును పాకెట్ నుంచి చెల్లించడం నిజంగా తలకు మించిన భారం అవుతుంది. దీని కారణంగా అప్పుల పాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కరోనా మహమ్మారి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నింటినో అప్పుల పాలు చేసింది. ఆస్తులున్న వారు అమ్ముకుని ఒడ్డెక్కాల్సి వచ్చింది. ఈ అనుభవాలు, వాస్తవలను చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక రూపంలో హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ప్రయోజనాలు.. ఆరోగ్య అత్యవసర సమయాల్లో ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఉంటే అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరాల్సి వస్తే అక్కడ చికిత్సల చార్జీలు, వైద్యుల కన్సల్టేషన్, అంబులెన్స్ చార్జీలు, రూమ్ చార్జీలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అంతేకాదు డిశ్చార్జ్ చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు ఔషధాలు, వైద్య పరీక్షలకు అయ్యే వ్యయాలను కూడా భరిస్తాయి. హాస్పిటల్లో చేరడానికి ముందు అదే సమస్య కోసం నిర్ణీత రోజుల కు చేసిన వైద్య వ్యయాలను సైతం చెల్లిస్తాయి. ఆర్థిక స్థిరత్వం వైద్యం ఎప్పుడు అవసరపడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఎలాంటి చికిత్స అవసరపడుతుంది? ఎంత ఖర్చవుతుందన్నది ఊహించడం కష్టం. అలాంటి పరిస్థితి వస్తే పొదుపు సొమ్ము అంతా కరిగిపోకుండా, అప్పుల పాలు కాకుండా, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం రాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థికంగా ఆదుకునే సాధనం కూడా అవుతుంది. మెరుగైన వైద్య చికిత్సలు/రక్షణ తమతోపాటు, తమపై ఆధారపడిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల.. వైద్యం అవసరమైన సందర్భంలో వెనుకాడాల్సిన పని ఉండదు. అదే హెల్త్ ప్లాన్ లేదనుకోండి.. తగినంత ఆర్థిక పొదుపుల్లేనప్పుడు, హాస్పిటల్‌కు వెళ్లే విషయంలో చికిత్సల వ్యయాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచి హాస్పిటల్‌కు వెళ్లి, ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యమైన వైద్యం పొందే ధైర్యం వస్తుంది. ఖర్చు గురించి కాకుండా, మంచి చికిత్స గురించి ఆలోచించే స్వేచ్ఛ హెల్త్ ప్లాన్‌తో వస్తుంది. జీవిత లక్ష్యాలకు మిగులు వైద్య చికిత్సల వ్యయాలు ఏటేటా పెరుగుతుంటాయి. ముఖ్యంగా నేడు వాతావరణ కాలుష్యం, జీవనశైలి వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వీటికి పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. ఈ భారాన్ని తమపై పడకుండా చూసుకుంటే.. జీవితంలో ముఖ్యమైన పిల్లల విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. హెల్త్ మాదిరిగా ఈ లక్ష్యాలకు ఎలాంటి కవరేజీ ఉండదని గుర్తు పెట్టుకోవాలి. పన్ను ప్రయోజనాలు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వ్యక్తులు, తాను, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం చెల్లించే హెల్త్ ఇన్సరెన్స్ ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 వరకు ఉంటే, ఈ మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రూ.50వేల ప్రీమియంపై ఆదాయపన్ను మినహాయింపు ఉంది. సొంతంగా ఉండాల్సిందే ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఆయా సంస్థలు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంటాయి. దీంతో వారు విడిగా హెల్త్ ప్లాన్ ఎందుకులేనని అనుకుంటుంటారు. కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు భద్రత ఉండదని తెలుసు. కంపెనీలు ఇచ్చే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగం మానివేయడంతో నిలిచిపోతుంది. అందుకుని విడిగా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తప్పకుండా తీసుకోవాలి. పనిచేస్తున్న సంస్థ నుంచి మెరుగైన కవరేజీ లేకపోయినా, ఇది ఆదుకుంటుంది. తక్కువ కవరేజీకి తీసుకుని, దానికి సూపర్ టాపప్ జోడించుకోవచ్చు. ఎంత ముందు అయితే అంత మంచిది వైవాహిక జీవితం ఆరంభించినప్పుడు లేదా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడే హెల్త్ కవరేజీ ఉండాలి. 20ప్లస్‌లోనే ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణ సమస్య ఎదురుకాదు. ఎందుకంటే 20ప్లస్‌లో ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉండవు. కానీ, నేడు 30 దాటిన దగ్గర్నుంచి రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, శ్వాసకోస సమస్యలు వేధిస్తున్నాయి. ఆలస్యం చేసినకొద్దీ, ఇవన్నీ పూర్వం నుంచి ఉన్న ఆరోగ్య సమస్యల కిందకు వస్తాయి. కనుక వీటిని పాలసీ డిక్లరేషన్‌లో తప్పకుండా వెల్లడించాలి. అలా చేసినప్పుడు అధిక ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైగా అప్పటికే ఉన్న వాటికి కవరేజీ కోసం 3–4 ఏళ్లు వేచి చూడాల్సి రావచ్చు. పలు రకాల ప్లాన్లు.. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్, క్రిటికల్ ఇల్నెస్, టాపప్, సూపర్ టాపప్ ఇలా పలు రకాల పాలసీలు ఉన్నాయి. బేసిక్ ప్లాన్ ఏదైనా కానీ, కాంప్రహెన్సివ్ అయి ఉండాలి. అంటే అన్ని రకాల కవరేజీలతో కూడి ఉండాలి. వివాహం అయిన వారు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి. వృద్ధులైన తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే, వారికి విడిగా మరో ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. ఇక క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు అనేవి.. కేన్సర్, మూత్ర పిండాల సమస్యలు, గుండె జబ్బులు, లివర్ ఫెయిల్యూర్, స్ట్రోక్ ఇలా దీర్ఘకాలిక సమస్యలు నిర్ధారణ అయినప్పుడు బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించే ప్లాన్లు. టాపప్ ప్లాన్లు అనేవి.. బేసిక్ హెల్త్ కవరేజీ మించి వైద్య చికిత్సల వ్యయాలు అయినప్పుడు.. బేసిక్ కవరేజీ పోను అదనపు మొత్తాన్ని చెల్లించేవి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.. ► ఎంపిక చేసుకునే బీమా కంపెనీ జాబితాలో ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయనేది చూడాలి. ముఖ్యంగా మీరు నివాసం ఉంటున్న పట్టణంలో ఎన్ని హాస్పిటల్స్ బీమా కంపెనీ నెట్వర్క్ కింద ఉన్నాయో చూడాలి. నెట్వర్క్ హాస్పిటల్ అయితే నగదు రహిత వైద్యం పొందొచ్చు. లేదంటే చికిత్సల ఖర్చు అంతా సొంతంగా భరించి, తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం శ్రమతో, సమయంతో కూడుకున్నది అవుతుంది. ► బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూడాలి. తనవద్దకు వచ్చే క్లెయిమ్‌లలో ఎన్నింటికి చెల్లింపులు చేస్తుంది.. అలాగే వచ్చిన క్లెయిమ్ అమౌంట్లో, ఎంత మొత్తానికి చెల్లింపులు చేసిందనే విషయాన్ని ముందే తెలుసుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు పూర్తిగా తిరస్కరిస్తే, కొన్ని కంపెనీలు క్లెయిమ్‌లో కోతలు పెడుతుంటాయి. కనీసం 90 శాతానికి పైనే సెటిల్మెంట్ రేషియో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది. ► హాస్పిటల్లో చేరడానికి ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు కవరేజీ ఉంటుందో (ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్) చూడాలి. సాధారణంగా 30–180 రోజుల వరకు ఈ కాలం ఉంటుంది. గరిష్ట కాలానికి చెల్లింపులు చేసే ప్లాన్లు అయితే అనుకూలం. ఎందుకంటే కొన్ని సమస్యలకు డిశ్చార్జ్ తర్వాత కూడా చాలా కాలం పాటు ఔషధాలు తీసుకోవాల్సి రావడం, మళ్లీ, మళ్లీ వైద్యుల రివ్యూలు అవసరపడతాయి. ► ఎంపిక చేసుకునే ప్లాన్‌కు తప్పకుండా రీస్టోరేషన్ సదుపాయం ఉండాలి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎవరైనా హాస్పిటల్లో చేరి కవరేజీ మొత్తం ఖర్చయిపోతే ఈ ఫీచర్ అక్కరకు వస్తుంది. కొన్ని ఒకటి నుంచి మూడు సార్లు రీస్టోరేషన్ ఇస్తుంటే, కొన్ని అన్లిమిటెడ్ రీస్టోరేషన్ ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీనివల్ల అదే ఏడాది తదనంతరం హాస్పిటలైజేషన్కూ కవరేజీ ఉంటుంది. ► రూమ్ రెంట్ పరిమితులు, కోపే ఆప్షన్ లేని ప్లాన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. కోపే ఆప్షన్లో క్లెయిమ్ ఎదురైన ప్రతి సందర్భంలోనూ పాలసీదారు తనవంతు కొంత భరించడం. రూమ్ రెంట్ పరంగా షేరింగ్, సింగిల్ రూమ్ అనే పరిమితులు ఉంటే, హాస్పిటల్లో చేరినప్పుడు ఆయా రూమ్‌ల్లోనే చేరుతున్నామా? అన్నది జాగ్రత్త పడాలి. లేదంటే ఈ రూపంలోనూ పాలసీదారుపై అదనపు భారం పడుతుంది. ► నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ కూడా ఉపయోగకరం. దీనికింద క్లెయిమ్ చేయని ప్రతీ సంవత్సరానికి నిర్ణీత శాతం మేర కవరేజీని బీమా కంపెనీలు పెంచుతాయి. క్లెయిమ్ వస్తే అంతే మేర తగ్గిస్తాయి. ► డైలీ క్యాష్ బెనిఫిట్‌ను చాలా బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఆసుపత్రిలో ఎక్కువరోజుల పాటు ఉండాల్సి వస్తే, పేషెంట్‌కు సాయంగా ఉండేవారికి అయ్యే వ్యయాలకు ఇది పనికొస్తుంది. ► అదనపు సభ్యులను చేర్చుకునే ఫీచర్ ఉండాలి. ► డేకేర్ చికిత్సలకు కవరేజీ ఇచ్చే ప్లాన్ మంచిది. కొత్త టెక్నాలజీలు, పరిశోధనలతో కొన్ని సమస్యలకు చికిత్సలు తేలిగ్గా మారుతున్నాయి. వీటికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడదు. కానీ, బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇండెమ్నిటీ ప్లాన్లలో కవరేజీ కోసం కనీసం 24 గంటల పాటు అడ్మిట్ కావాల్సి ఉంటుంది. డేకేర్ చికిత్సలకు ఇది వర్తించదు. ► అంబులెన్స్ చార్జీలను చెల్లించేలా ఉండాలి. ► ఆధునిక, రోబోటిక్ చికిత్సలకు, అవయవమార్పిడి చికిత్సలకు కూడా కవరేజీ ఉండాలి. ► పెళ్లయి, పిల్లలు ఇంకా లేని వారు అయితే తప్ప కుండా మేటర్నిటీ కవరేజీ ఉండే ప్లాన్‌కు వెళ్లాలి. ► ఏడాదికోసారి ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలను బీమా కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తుందా? అన్నది చూడాలి. ► పాలసీ తీసుకునే నాటికే ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం సాధారణంగా 4 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ఆ కాలంలో ముందు నుంచి ఉన్న వాటికి క్లెయిమ్ చేసుకోలేరు. కొన్ని ప్లాన్లు 1–2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్‌తో ఉంటున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం అధికంగా ఉంటుంది. ► తీసుకున్న ప్లాన్ జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే ఫీచర్‌తో ఉండాలి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు కంపెనీ సేవల నాణ్యత, ఎంత వేగంగా చెల్లింపులు చేస్తుంది? ఇతర కంపెనీల ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం వ్యత్యాసం ఎంతన్నది తెలుసుకోవాలి. ► కొన్ని రకాల చికిత్సలకు కవరేజీ ఉండదు. పైగా కొన్ని రకాల చికిత్సలకు 2 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వీటి వివరాలను పాలసీ వర్డింగ్ డాక్యుమెంట్ చదివి తెలుసుకోవాలి. -
జాతీయ కుటుంబ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో లింగ సమానత్వంపై కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యపూరిత కార్యక్రమాలు సత్ఫలితాలిచాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ సర్వే వెల్లడించింది. రాష్ట్ర సంగటు కంటే జిల్లాలోనే మహిళ సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఐదేళ్ల క్రితం ప్రతి వేయి మంది పురుషులకు జిల్లాలో 1,007 మంది మహిళలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా ఆ సంఖ్య 1,053కు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలో ఈ విషయాలను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ స్పష్టంచేసింది. 2019 జూన్ 30 నుంచి కేంద్ర కుటుంబ నవంబరు 14 వరకు 892 కుటుంబాల్లోని 911 మంది మహిళలు, 119 మంది పురుషులతో సర్వే నిర్వహించినట్లు ఆరోగ్య సంక్షేమశాఖ తెలియజేసింది. చదవండి: ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం తగ్గిన సిజేరియన్లు.. జిల్లాలో ప్రసవాలను పరిశీలిస్తే గతంలో కంటే సిజేరియన్ ప్రసవాలు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన సర్వేలో సిజేరియన్ ప్రసవాలు 46.9 శాతంగా నమోదైతే.. ఐదేళ్ల తర్వాత అంటే 2019–20లో 43.2 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఐదేళ్ల క్రితం 65.1 శాతంగా ఉండగా...2019–20లో 71.6 శాతానికి పెరగడం గమనార్హం. నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8 కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. తగ్గని మధుమేహం.. జిల్లాలో పురుషులు, మహిళల్లో మధుమేహం (డయాబిటీస్) ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయటపెట్టింది. 141–160 ఎంజీ/డీఎల్ ఉన్నవారిలో మహిళలు 4.4 శాతం మంది, పురుషులు 6.3 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 5.3, పురుషులు 8.7 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 11.3 శాతం, పురుషులు 16.3 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరింత పెరిగే అవకాశం.. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భవిష్యత్‌పై ప్రభుత్వం అవగాహనా, చైతన్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో, విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. గర్భిణులుగా ఉన్నప్పుడు స్కానింగ్ లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవరిస్తున్నారు. వైద్యులు కూడా అబార్షన్లు చేయడంలేదు. ఐసీడీఎస్ ద్వారా ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. మున్ముందు బాలికల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘బేఠీ బచావో–బేఠీ పడావో’ నినాదం కూడా బాలికల శాతం పెరగడానికి దోహదపడింది. – పద్మావతి, ఐసీడీఎస్ పీడీ జిల్లా వివరాలు 2015–16(శాతం) 2019–20(శాతం) ఆరేళ్లు, ఆపై వయస్సు గల వారు పాఠశాలకు వెళ్తున్న వారు 57 60.2 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 26.1 24.1 మహిళల్లో అక్షరాస్యత 57 63.6 20 ఏళ్లలోపు బాలికల వివాహాలు 36.3 30.6 -
భర్తను పంచుకుంటేనే మంచిదట!
బహుభార్యత్వం.. అంటే ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లాడటం తప్పని అందరూ అంటుంటారు. కానీ, తాజాగా చేసిన పరిశోధనలో మాత్రం.. కొన్ని పరిస్థితులలో భర్తను పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందట! ప్రపంచంలో చాలా దేశాలు బహుభార్యత్వాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల సంఘాలు కూడా ఇది మహిళల పట్ల వివక్షేనంటాయి. ఈ విషయాన్ని తేల్చేందుకు ఉత్తర టాంజానియాలోని 56 గ్రామాల్లో బహుభార్యత్వం ఉన్న కుటుంబాలు, అలాకాకుండా ఒక భర్త ఒకే భార్యతో ఉంటున్న కుటుంబాలపై పరిశోధన చేశారు. టాంజానియాలోని కొన్ని తెగలలో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారు. ఇక్కడ ఒక భర్తకు ఒకే భార్య ఉన్న కుటుంబాల కంటే ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాల్లోనే తగినతం ఆహారం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉన్నారట. బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో పశుసంపద కూడా బాగుందని, మామూలు వాళ్ల కంటే పెద్ద కమతాలలో వీళ్లు వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. అప్పటివరకు పెళ్లి చేసుకోకుండా, 3 ఆవులు, ఒక ఎకరం భూమి ఉన్నవాళ్ల కంటే.. 180 ఆవులు, బోలెడంత భూమితో పాటు కొందరు భార్యలు కూడా ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం మేలని అక్కడి యువతులు భావిస్తున్నట్లు పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మోనిక్ బోర్గెరాఫ్ మల్డర్ చెప్పారు. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. వాటిని లెక్కలోకి తీసుకోకుండానే బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల మహిళలకు ఉండే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పారు. ఎంతమంది భాగస్వాములు ఉండొచ్చన్నది సమస్య కాదని, తాము కోరుకున్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. టాంజానియా లాంటి దేశాల్లో ఆహారభద్రత చాలా సమస్యగా ఉంది. ఇక్కడ పౌష్టికాహారం అందక చిన్నవయసులోనే పిల్లలు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాసాయ్ లాంటి తెగలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.