
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు సరికొత్త EVలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఏవి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
టాటా హారియర్ ఈవీ
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా సాగుతున్న.. టాటా మోటార్స్ జూన్ 3న హారియర్ ఈవీ లాంచ్ చేయనుంది. ఇది 500 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందుతుందని సమాచారం. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగానే ఇది కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ధర, బుకింగ్స్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
కియా క్లావిస్ ఈవీ
కియా మోటారు తన క్లావిస్ కారును ఈ రోజు (మే 23) రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి ఇంకా కొంచెం సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 400 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్
మహీంద్రా XUV 3ఎక్స్ఓ ఈవీ
ఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉంది. ఈ కంపెనీ XUV 3ఎక్స్ఓ ఈవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఇది 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
మారుతి ఈ విటారా
మారుతి సుజుకి కూడా ఈ ఏడాది తన మొట్టమొదటి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించింది. ఇది సెప్టెంబర్ 2025 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 48.8 కిలోవాట్ బ్యాటరీ, 61.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉండనున్నాయి.