
కాదేదీ డోర్ డెలివరీకి అనర్హం అన్నట్లు ఆర్డర్ ఇస్తే చాలు ఇప్పుడు ప్రతీదీ ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ నిత్యావసర సరుకుల మాదిరిగానే బంగారాన్నీ డెలివరీ చేస్తామంటూ ముందుకు వచ్చింది. అయితే డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ కోసం ఆ కంపెనీ చేసిన హై సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వరుస వైరల్ వీడియోలు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో క్లిప్‌లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. సెక్యూరిటీ గార్డుతో కలిసి ట్రాఫిక్‌లో బైక్‌పై వెళ్తూ కనిపించారు. అందులో సెక్యూరిటీ గార్డు ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో హై సెక్యూరిటీ లాకర్ పట్టుకొని కనిపించాడు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
"ఏమి జరుగుతోంది?" అంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ప్రశ్నించగా "రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో (రియల్ గోల్డ్ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా) అని స్విగ్గీ చమత్కారంగా బదులిచ్చింది. ఆన్ లైన్ లో ప్రచారం ఊపందుకోవడంతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ వీడియోలను రీపోస్ట్ చేసింది. దీనికి బంగారమా? నిజంగానా?' అంటూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా దీనికి కూడా ‘డెలివరింగ్ సోనా ఇన్ ఎవరీ కోనా కోనా’(ప్రతి మూలకూ బంగారం డెలివరీ) అంటూ స్విగ్గీ రిప్లయి ఇచ్చింది.
కాగా కల్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి వివిధ బరువుల బంగారు, వెండి నాణేలను నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్విక్ కామర్స్ సర్వీస్ ద్వారా లభించే నాణేలలో 0.5 గ్రాములు, 1 గ్రాము బంగారు నాణేలు, అలాగే 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వెండి నాణేలు ఉన్నాయి.