
జీవన వ్యాయాలు పెరిగిపోతున్న తరుణంలో వేతన జీవుల అంచానాలు, ఆకాంక్షలు మారిపోతున్నాయి. 74 శాతం మంది ఉద్యోగులు వేతనాల కంటే కూడా బలమైన దీర్ఘకాలిక ప్రయోజనాలతో కొంచెం తక్కువ వేతనానికి మొగ్గుచూపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది.
హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ సపోర్ట్ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు బదులుగా కొంచెం తక్కువ వేతనాన్ని ఎంచుకుంటామని సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 74 శాతం మంది పేర్కొన్నట్లు స్టాఫింగ్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది.
జీనియస్ కన్సల్టెంట్స్ దేశవ్యాప్తంగా 1,139 మంది ఉద్యోగుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం కేవలం 32 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ ప్రస్తుత ప్రయోజనాల ప్యాకేజీ తమ ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడుతుందని భావించగా, 61 శాతానికి పైగా తమ ప్రయోజనాలు సరిపోవని చెప్పారు.
తమ యాజమాన్యాలు ఉద్యోగుల మానసిక, ఆర్థిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని 54 శాతం మంది చెప్పారు. హైబ్రిడ్ లేదా రిమోట్ అరేంజ్మెంట్స్ వంటి సౌకర్యవంతమైన పని ఎంపికలు తమకు ఆర్థికంగా కొంతమేర ఊరట కల్పిస్తాయని 84 శాతం మంది పేర్కొన్నారు.
పనితీరు ఆధారిత బోనస్‌లు, ప్రోత్సాహకాలు వారి ప్రస్తుత ఆర్థిక ఆందోళనలను గణనీయంగా తగ్గిస్తాయని 73 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇది వ్యక్తిగత పనితీరుకు ప్రతిఫలం ఇచ్చే, ఆదాయ అంతరాలను పూడ్చడానికి సహాయపడే వేరియబుల్ పరిహారానికి పెరుగుతున్న ప్రాధాన్యతను వెల్లడించింది.