సన్‌ ఫార్మా.. సూపర్‌ | Sakshi
Sakshi News home page

సన్‌ ఫార్మా.. సూపర్‌

Published Sat, Jul 31 2021 3:16 AM

Sun Pharma soars after turnaround Q1 numbers - Sakshi

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ రంగ దేశీ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో రూ. 1,444 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,656 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,585 కోట్ల నుంచి రూ. 9,719 కోట్లకు ఎగసింది. లోబేస్‌తోపాటు.. కీలక ఫార్మా బిజినెస్‌లో సాధించిన వృద్ధి ఇందుకు సహకరించినట్లు కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వీ పేర్కొన్నారు. కోవిడ్‌–19 ప్రొడక్టులు సైతం ఇందుకు మద్దతిచ్చినట్లు తెలియజేశారు.

ఫార్ములేషన్స్‌ జూమ్‌
క్యూ1లో సన్‌ ఫార్మా దేశీ బ్రాండెడ్‌ ఫార్ములేషన్స్‌ అమ్మకాలు 39 శాతం జంప్‌చేసి రూ. 3,308 కోట్లను అధిగమించాయి. మొత్తం ఆదాయంలో ఇవి 34 శాతం వాటాకు సమానంకాగా.. టారోతో కలిపి యూఎస్‌ విక్రయాలు 35 శాతం వృద్ధితో రూ. 2,800 కోట్లను తాకాయి. వీటి వాటా 29 శాతం. ఇక వర్ధమాన మార్కెట్ల ఆదాయం సైతం 25 శాతం పురోగమించి రూ. 1,605 కోట్లను అధిగమించింది. మొత్త ఆదాయంలో ఈ విభాగం 17 శాతం వాటాను ఆక్రమిస్తోంది.

మార్కెట్‌ క్యాప్‌ అప్‌
ఫలితాల నేపథ్యంలో సన్‌ ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 774 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 784 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌(విలువ) రూ. 16,971 కోట్లు బలపడింది. వెరసి రూ. 1,85,704 కోట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో 3.58 కోట్లు, బీఎస్‌ఈలో 20.34 లక్షల షేర్లు చొప్పున ట్రేడయ్యాయి.

Advertisement
Advertisement