8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్‌ | Stock market Huge Loss | Sakshi
Sakshi News home page

8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్‌

Apr 13 2026 9:37 AM | Updated on Apr 13 2026 11:11 AM

Stock market Huge Loss

స్టాక్‌ మార్కెట్లపై హర్ముజ్‌ సంక్షోభం ఎఫెక్ట్‌ పడింది. చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 1,350 పాయింట్లకుపైగా.. నిష్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యింది.

హర్ముజ్‌ జలసంధి సంక్షోభం ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్‌ సెషన్‌లో భారతీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యాయి. చర్చలు విఫలమవడంతో గ్లోబల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఒక్కసారిగా 8 శాతం పెరగడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం వెంటనే మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

సెన్సెక్స్‌ 73,000 స్థాయికి చేరగా, నిఫ్టీ 23,600 కంటే దిగువకు పడిపోయింది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనంతో మార్కెట్‌లో భయాందోళనలు పెరిగి, చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. 

చమురు ధరల పెరుగుదలతో ఎయిర్‌లైన్స్‌, పెయింట్స్‌, ఫర్టిలైజర్స్‌ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్‌ పెయింట్స్‌ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, ఎనర్జీ-అప్‌స్ట్రీమ్‌ రంగం, డిఫెన్స్‌ సంబంధిత షేర్లు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి. 

నిపుణుల అంచనా ప్రకారం.. హర్ముజ్‌ సంక్షోభం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దిగుమతి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు తాత్కాలికంగా రిస్క్‌ ఉన్న రంగాల నుండి దూరంగా ఉండి, స్థిరమైన రంగాల వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement