స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్‌ కాకి..

Startup layoffs cross more than 10000 in the name of restructuring - Sakshi

ద్రవ్యోల్బణంతో సతమతం అవుతుంటే కొత్తగా ఉద్యోగాల్లోనూ ఇబ్బందులు మొదలవుతున్నాయి. కోటి ఆశలతో మొదలైన స్టార్టప్‌ కంపెనీలో నష్టాలతో విలవిలాడుతున్నాయ్‌. ఆర్థిక భారం తగ్గించుకునే యత్నంలో నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయ్‌. భవిష్యత్తు ఆశాకిరణాల్లా కనిపించిన కంపెనీలే ఉద్యోగులపాలిట అశనిపాతాల్లా మారాయి.

దేశవ్యాప్తంగా స్టార్టప్‌ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌ బేస్డ్‌ సేవలు ప్రధానంగా వచ్చిన కొత్త కంపెనీల అడుగులు తడబడుతున్నాయ్‌. కరోనా ఎఫెక్ట్‌ తగ్గిపోయిన తర్వాత కంపెనీల పనితీరు ట్రాక్‌ తప్పుతోంది. నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రతీ నెల క్రమం తప్పకుండా నష్టాలు పలకరించి వెళ్తున్నాయ్‌. దీంతో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కాస్ట్‌ కట్టింగ్‌ వైపు స్టార్టప్‌ కంపెనీలు చూస్తున్నాయి.

రీ స్ట్రక్చర్‌ వంకతో 
దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఏడాదిలో ఇప్పటి వరకు పాపులర్‌ అయిన స్టార్టప్‌ కంపెనీల్లోనే ఏకంగా 10,500ల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. నష్టాల పేరు చెబుతూ కంపెనీ పునర్మిణాం పేరిట వీళ్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన తొలగింపు చర్యలు మే వచ్చే సరికి ఎక్కువై పోయాయి. రోజుకో స్టార్టప్‌ కంపెనీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

పాపులర్‌ స్టార్టప్‌లలోనూ
దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్‌ అయిన బ్రాండ్‌గా ఓలాకు పేరుంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు గమనిస్తే జనవరి నుంచి జూన్‌ వరకు ఓలా ఏకంగా 2100 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. ఇక యూట్యూబ్‌ ఆన్‌ చేసినా ఏ టీవీ ఛానల్‌ చూసినా కనిపించే అన్‌ అకాడమీ అనే ఎడ్యుటెక్‌ కంపెనీ 750 మందికి గుడ్‌బై చెప్పింది. తిరుగులేని కంపెనీగా పేరున్న ఓలా, అన్‌అకాడమీ పరిస్థితే ఇలా ఉంటే చోటామోటా స్టార్టప్‌లు ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

వీళ్లు కొంత సేఫ్‌
స్టార్టప్‌ల బిజినెస్‌లు అనుకున్నంతగా పుంజుకోకపోవడంతో ఉద్యోగులపై వేటు తప్పడం లేదు. ప్రస్తుతం జాబ్‌లు కోల్పోతున్న వారిని పరిశీలిస్తే.. మార్కెటింగ్‌, సేల్స్‌  విభాగాల్లో ఎక​‍్కువగా ఉంటున్నాయి. ఇంజనీరింగ్‌, ప్రొడక్టు విభాగంలో కొంత మెరుగైన ఉద్యోగ భద్రత లభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భారీగా తగ్గిపోయి ప్రైవేటు సెక్టారే శరణ్యం అనే పరిస్థితులు నెలకొనగా.. స్టార్టప్‌లు సైతం చేతులు ఎత్తేడయంతో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా మారే పరిస్థితులు ఎదురవడానికి ఎంతో దూరం లేదని నిపుణులు అంటున్నారు. 

తొలగింపే పరిష్కారమా?
మార్కెట్‌లో నిలదొక్కుకున్న కంపెనీలుగా గుర్తింపు దక్కించుకున్న మీషో, వేదాంతూ, బ్లింకిట్‌, కార్‌24 వంటి సంస్థలు కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే వస్తున్న నష్టాల పట్ల వెంచర్‌ క్యాపిటలిస్టులు ఆందోళన వ్యక్తం చేయడంతో మరిన్ని నిధులు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆర్థిక భారం మరింత ముదరకుండా ఉద్యోగుల తొలగింపే మేలైన పరిష్కారం అనే భావనలోకి స్టార్టప్‌లు వస్తున్నాయి. 

చదవండి: అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్‌ కార్పెట్‌: ఉద్యోగాలు పెరుగుతాయి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top