
మన ఫోన్‌లకు రోజూ పదుల సంఖ్యలో వివిధ రకాల ఎస్‌ఎంఎస్‌లు వస్తుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రమోషనల్ మెసేజ్‌లే ఉంటుంటాయి. వీటి మధ్య ముఖ్యమైన మెసేజ్‌లను చూసుకోకుండా విస్మరిస్తుంటాం. కానీ ఈ మధ్య వస్తున్న వస్తున్న ఎస్‌ఎంఎస్‌లను గమనిస్తే కొత్త మార్పులు కనిపిస్తాయి. అదేమీ లేదండి ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో సులువుగా తెలిసేలా ట్రాయ్ ఇటీవల కొత్త ఎస్‌ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది.
మనకు వచ్చే ప్రతి ఎస్‌ఎంఎస్ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేలా ఐడింటిఫికేషన్ అక్షరం ఉంటుంది. ఎస్‌ఎంఎస్ హెడర్‌లో పీ(P) అని ఉంటే ప్రమోషనల్ అంటే వివిధ కంపెనీలు తమ ప్రచారం కోసం పంపించే మెసేజ్‌లు అన్నమాట. ఎస్(S) అని ఉంటే సర్వేస్ అంటే సాధారణ సమాచారం తెలియజేసేవి అని అర్థం. ఇక టీ(T) అని ఉంటే ట్రాన్సాక్షనల్ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలు, జీ(G) అని ఉంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం. ఇలా.. ఏదైనా ఎస్‌ఎంఎస్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెరిచి చదవకుండానే దాని ఉద్దేశం తెలుసుకోవచ్చు.
ఈ మార్పు ఎందుకంటే..
దేశంలో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు తరచూ స్పామ్, అవాంఛిత ఎస్ఎంఎస్ సందేశాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఏ సందేశాలు ముఖ్యమైనవి, ఏవి అసంబద్ధమైనవి అని తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటానికి ఫిల్టర్‌గా పనిచేసేలా కొత్త అనుబంధ వ్యవస్థను రూపొందించారు.