మానవ వనరుల కొరత.. పేటెంట్లపై ప్రభావం!

న్యూఢిల్లీ: మానవ వనరులు, నిబంధనలను పాటించడానికి కష్టతరమైన పరిస్థితులే దేశీయంగా పేటెంట్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొంది. అత్యవసరంగా పేటెంట్ వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంపై దీన్ని ఈఏసీ–పీఎం రూపొందించింది. భారత్‌లో ఇటీవలి కాలంలో దాఖలైన, మంజూరైన పేటెంట్ల సంఖ్య పెరిగినప్పటికీ .. అమెరికా, చైనా లాంటి వాటితో పోలిస్తే తక్కువగానే ఉందని ఇందులో పేర్కొంది.
2022 మార్చి ఆఖరు నాటికి పేటెంట్ ఆఫీసులో 860 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. చైనాలో ఈ సంఖ్య 13,704 కాగా అమెరికాలో 8,132గా ఉందని వివరించింది. చైనాలో సగటున పేటెంట్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి 20–21 నెలల సమయం పడుతుందని.. భారత్‌లో ఇందుకు 58 నెలలు పడుతోందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆఖరు నాటికి పేటెంటు కార్యాలయంలో కంట్రోలర్ స్థాయిలో 1.64 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. వచ్చే రెండేళ్లలో పేటెంట్ ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య కనీసం 2,800కి పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.