భారత్‌ జీడీపీ వృద్ధి 8.1 శాతం

SBI Research Report Says India GDP Growth Rate touches 8.1 - Sakshi

క్యూ2పై ఎస్‌బీఐ రిపోర్ట్‌  

ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా కట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఆర్‌బీఐ అంచనా ప్రకారం జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా 9.5 శాతం. క్యూ2లో 7.9 శాతం, క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. తాజాగా దేశ ఎకానమీపై ఎస్‌బీఐ రిసెర్చ్‌ రిపోర్ట్‌లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 
- రెండవ త్రైమాసికంలో 8.1 శాతం వృద్ధి నమోదయితే, అది ప్రపంచంలోనే సంబంధిత క్వార్టర్‌లో అత్యధిక వృద్ధి రేటుగా ఉంటుంది. త్రైమాసికంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్‌ పొందుతుంది. 
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ ప్రకటించారు. అయితే ఈ బిల్లులు లేకపోయినప్పటికీ, కేంద్రం అమలు చేస్తామని పేర్కొంటున్న ఐదు వ్యవసాయ సంస్కరణలు  ఈ రంగంలో మంచి ఫలితాలకు దారితీస్తాయి.  
- వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ)ల విషయంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌లో ధరల విధానాన్ని పర్యవేక్షించే ప్రత్యేక యంత్రాంగంతో కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ భారతదేశంలో స్థాపించడానికి చర్యలు   కొనసాగాలి.  
- వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ప్రొక్యూర్‌మెంట్‌ విధానం వ్యవస్థాగతం కావాలి. 
ద్రవ్యలోటు తగ్గే అవకాశం: ఫిచ్‌ 
ఇదిలావుండగా, 2021–22లో ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలకన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌ అంచనావేసింది. అంచనాలకు మించి ఆదాయాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ అంచనాలు నెలవేరకున్నా, ద్రవ్యలోటు 6.6 శాతం అంచనాలకన్నా తక్కువగానే ఉండే వీలుందని పేర్కొంది. 2021–22లో 1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరం మొత్తంగా 15.06 లక్షల కోట్లుండాలన్నది బడ్జెట్‌ నిర్దేశం.జీడీపీలో ఈ నిష్పత్తి అంచనా 6.8 శాతం. అయితే సెప్టెంబర్‌ నాటికి బడ్జెట్‌ అంచనాల్లో 35 శాతానికి ఎగిసింది.

చదవండి: ఎకానమీ రికవరీ వేగవంతం: పీహెచ్‌డీసీసీఐ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top