ఎకానమీ రికవరీ వేగవంతం: పీహెచ్‌డీసీసీఐ

India economic recovery gains momentum in recent months - Sakshi

113 నుంచి 131కి పెరిగిన ఇండెక్స్‌  

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ ఇటీవలి నెలల్లో వేగవంతం అయ్యిందని ఇండస్ట్రీ చాంబర్‌ పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ ముల్తానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ భారీగా జరగడం, పండుగల సీజన్, వినియోగ డిమాండ్‌ మెరుగుపడ్డం, పారిశ్రామిక సెంటిమెంట్‌ బాగుండడం దీనికి కారణమని తెలిపారు. పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్‌ ఇండెక్స్‌ సెప్టెంబర్‌లో 113.1 వద్ద ఉంటే, అక్టోబర్‌లో 131కి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే సూచీ 78.7 నుంచి 114.8కి ఎగసిందని తెలిపారు.  వస్తు సేవల పన్ను వసూళ్లు, పాసింజర్‌ వాహన విక్రయాలు, సెన్సెక్స్‌ సగటు రోజూవారీ కదలికల ప్రాతిపదికన పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ జీపీఎస్‌ ఇండెక్స్‌ కదలికలు ఉంటాయి. ఆయా అంశాలు ఎకానమీ పురోగతికి సానుకూలంగా ఉన్నాయని ప్రదీప్‌ ముల్తానీ పేర్కొన్నారు.  

సవాళ్లూ ఉన్నాయ్‌...
అయితే అధిక కమోడిటీ ధరలు, ముడిపదార్థాల సరఫరాల కొరత సమస్యలుగా ఉన్నాయన్నారు. వినియోగం పెరగడానికి, ప్రైవేటు పెట్టుబడులు పురోగమించడానికి ఈ సవాళ్ల పరిష్కారం తక్షణ అవసరమని సూచించారు. గృహ వినియోగం మరింత పటిష్ట పడాల్సి ఉందని వివరించారు. ఆయా అంశాలు పెట్టుబడుల పురోగతికి దోహదపడతాయని ప్రదీప్‌ ముల్తానీ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top