ఎంఎన్‌సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా!

Sbi Magnum Global Fund Direct Growth Review - Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లలో బహుళజాతి కంపెనీలకు (ఎంఎన్‌సీలు) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవి మంచి యాజమాన్యం నిర్వహణలో, సాంకేతికంగా, ఎన్నో బలాలతో కొనసాగుతుంటాయి. అనిశ్చిత పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాలతో ఉంటాయి. కానీ, గత మూడు, ఐదేళ్ల కాలంలో ఎంఎన్‌సీ కంపెనీలు లార్జ్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే పెట్టుబడిదారులకు రాబడులను ఇచ్చే విషయంలో వెనుకబడ్డాయి. కానీ, ఇది ఎల్లకాలం కొనసాగబో దు. మళ్లీ ఇవి రాబడుల సైకిల్‌లోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ క్రమంలో ఆకర్షణీయమైన వ్యాల్యూషన్ల వద్ద లభిస్తున్న ఎంఎన్‌సీల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకునేవారు.. ఎస్‌బీఐ మాగ్నమ్‌ గ్లోబల్‌ ఫండ్‌ను పరిశీలించొంచొచ్చు.  

రాబడులు 
మోస్తరు రిస్క్‌ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలం. లార్జ్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. విదేశీ ఈక్విటీల్లోనూ ఎక్స్‌పోజర్‌ తీసుకుంటుంది. దీర్ఘకాలం నుంచి నడుస్తున్న థీమ్యాటిక్‌ పథకాల్లో ఇది కూడా ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ పథకానికి 28 ఏళ్ల చరిత్ర ఉంది. ఆరంభం నుంచి చూసుకుంటే ఈ పథకంలో వార్షిక రాబడి రేటు 14.32 శాతంగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం నికరంగా ఎటువంటి రాబడులను ఇవ్వలేదు. అదే మూడేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా 17.52 శాతం చొప్పు న ప్రతిఫలాన్నిచ్చింది. ఐదేళ్లలో కాలంలో 11 శాతం, ఏడేళ్లలో 10 శాతం, పదేళ్లలో 16.51 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది.  

పోర్ట్‌ఫోలియో 
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,824 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 94 శాతాన్ని కేటాయించింది. మిగిలిన పెట్టుబడులను నగదు, డెట్‌ రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 24 స్టాక్స్‌ ఉన్నాయి. మొదటి 10 స్టాక్స్‌లోనే 53 శాతం పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 45 శాతం, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లోనూ 45 శాతానికి పైగా సమాన పెట్టుబడులను నిర్వహిస్తోంది. స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 8.59 శాతం కేటాయించింది. పెట్టుబడుల్లో కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తూ, 23 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఆ తర్వాత క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీల్లో 19.44 శాతం, సేవల రంగ కంపెనీల్లో 13.92 శాతం, ఆటోమొబైల్‌ కంపెనీల్లో 11 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.  

పెట్టుబడుల విధానం 
దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడిని వృద్ధిని చేసే విధంగా ఈ పథకం పనితీరు ఉంటుంది. ప్రధానంగా ఎంఎన్‌సీ కంపెనీలకు పెట్టుబడులు కేటాయిస్తూ, వైవిధ్యాన్ని పాటిస్తుంది. విదేశాల్లో లిస్ట్‌ అయిన ఎంఎన్‌సీల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. పోర్ట్‌ఫోలియోలోని 24 స్టాక్స్‌లో నాలుగు యూఎస్‌ స్టాక్స్‌ ఉన్నాయి. ఆల్ఫాబెట్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, నివిడా కార్పొరేషన్‌లో 18 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఎంఎన్‌సీ థీమ్‌తో నడిచే పథకం అయినప్పటికీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని వాటికి కేటాయించే విధానంతో పనిచేస్తుంది. మిగిలిన 20 శాతాన్ని ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వెలుసుబాటు ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top