Russia Ukraine War Impact: యుద్ధంతో మనకు ఇబ్బందే, జయంత్‌ వర్మ

Russia-Ukraine Conflict Likely To Have Adverse Effects On Economic Growth - Sakshi

న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అంశాలకు సవాళ్లను విసురుతాయని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ పేర్కొన్నారు. విధాన నిర్ణేతలు తాజా పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధపడాలని సూచించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండగా, ఇప్పటికే ఇది ఎగువ స్థాయిలో ఉందన్న విషయం గమనించాల్సిన కీలక అంశమన్నారు. బ్యారల్‌ క్రూడ్‌ ధర 75 డాలర్ల అంచనాలతో 2022–23 బడ్జెట్‌ రూపొందగా, యుద్ధంతో ఇది 110 డాలర్ల స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

మూడేళ్లగా మందగమనంలో ఉన్న ఎకానమీ ఇంకా ఊపందుకోలేదని, ప్రైవేటు పెట్టుబడుల్లో పురోగతి లేదని, ప్రైవేటు వినియోగం కూడా పుంజుకోలేదని అన్నారు. ఆ నేపథ్యంలోనే తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తత ఆందోళనకరమని అన్నారు. అమెరికా వడ్డీరేట్లు పెంచిన పక్షంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత్‌ 2013కన్నా ఇప్పుడు మెరుగైన స్థానంలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల పర్భావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.  కరెంట్‌ అకౌంట్‌ (దేశానికి వచ్చీ పోయే విదేశీ మారకం మధ్య నికర వ్యత్యాసం) లోటును నిర్వహించగలిగిన స్థాయిలో భారత్‌ ఉందన్నారు. డాలర్‌–రూపాయి మారకపు విలువల కదలికలపై తక్షణం ఆందోళన పడాల్సింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top