రెట్రో వివాద పరిష్కార దిశలో వేదాంత!

Retro tax: Vedanta withdraws case against govt in Delhi HC, arbitration tribunal - Sakshi

కోర్టుల్లో కేసుల ఉపసంహరణ

విలువ దాదాపు రూ.20,495 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్‌ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్‌ అనిల్‌ అగర్వాల్‌ మైనింగ్‌ గ్రూప్‌ వేదాంతా ముందడుగు వేసింది. ప్రభుత్వంపై ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అలాగే ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ (ఐఏటీ)లో విచారణలో ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... బ్రిటీష్‌ మాతృసంస్థ ద్వారా వచ్చిన మూలధన లాభాలపై పన్ను తీసివేయడంలో విఫలమైనందుకు కెయిర్న్‌ ఇండియా నుండి రూ. 20,495 కోట్ల పన్నులను (పెనాల్టీతో సహా) ఐటీ శాఖ డిమాండ్‌ చేసింది.

అటు తర్వాత 2011లో కెయిర్న్‌ ఇండియాను అగర్వాల్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. వేదాంతా లిమిటెడ్‌లో ఈ సంస్ధ విలీనమైంది. దీనితో పన్ను డిమాండ్‌ కేసు విషయంలో ఐటీ శాఖతో వేదాంత న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్‌ ట్యాక్స్‌) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో  కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top