
ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం రెనో సరికొత్త ‘ఆల్–న్యూ రెనో ట్రైబర్’ను లాంచ్ చేసింది. ఈ కొత్త ట్రైబర్‌లో దాని ప్రత్యేకమైన 7 సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుతూ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.6.29 లక్షలుగా ఉంది.
ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధించిన తర్వాతే మార్కెట్లోకి ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్, నిబంధనలు, ఎకో సిస్టమ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో ఈవీలను ఆవిష్కరిస్తామన్నారు.
డిజైన్‌లో చేసిన మార్పులు ఎక్స్‌టీరియర్ నుంచే కనిపిస్తున్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ ట్రైబర్ పూర్తిగా పునరుద్ధరించిన ఫ్రంట్ ఫేస్‌ను కలిగి ఉంది. వర్టికల్ స్లాట్‌లను కలిగి ఉన్న గ్లాస్ బ్లాక్ గ్రిల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో కూడిన కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లలోకి అనుసంధానమై ఉంటుంది.ఫ్రంట్ బంపర్‌ను కూడా పూర్తీగా మార్చేశారు. సిల్వర్ యాక్సెంట్‌లతో పెద్ద ఎయిర్ డ్యామ్, రీపోజిషన్ చేసిన ఫాగ్ ల్యాంప్‌లు, వర్టికల్ ఎయిర్ ఇన్‌లెట్‌లను కలిగి ఉంటుంది.
కొత్త ట్రైబర్‌లో రెనాల్ట్ సొగసైన 2డీ డైమండ్ లోగోను తీసుకొచ్చారు. స్టైలిష్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా నల్లటి రూఫ్‌ను పొందుతుంది. వెనుక భాగంలో, టెయిల్‌గేట్‌లో స్లీకర్ ఎల్‌ఈడీ టెయిల్-ల్యాంప్‌లు, గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్, 'TRIBER' లెటరింగ్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి.
లోపల, క్యాబిన్ పాత బ్లాక్ అండ్ సిల్వర్ లేఅవుట్ స్థానంలో ఇప్పుడు ఫ్రెష్ గ్రే అండ్ బీజ్ థీమ్‌ను కలిగి ఉంది. నవీకరించిన డాష్‌బోర్డ్ డిజైన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంది. ఏసీ వెంట్స్ కింద ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ ట్రైబర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తుంది.