
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కరోజులో భారీగా పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో (ఎన్ఎస్ఈ) రిలయన్స్ షేర్ ఐదు శాతానికి పైగా నష్టపోవడంతో, రిలయన్స్ సంస్థ 5.2 బిలియన్ల డాలర్ల మేర నష్టపోయింది. నిఫ్టీ ఇంట్రా ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు నిమిషానికి 12 మిలియన్ల డాలర్ల మేరకు సంపదను కోల్పోగా, రిలయన్స్ సంస్థ మరింత నష్టాన్ని చవి చూసింది. సోమవారం చవిచూసిన నష్టాల కారణంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అతని సంపద 79.2 బిలియన్ల డాలర్ల వద్ద స్థిరపడిందని ఆ సంస్థ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో రిలయన్స్ నిర్వహణ ప్రగతి బలహీనంగా ఉందని, ఇదే కొనసాగితే ఆ సంస్థ మార్కెట్ అంచనాలను చేరుకోలేదని కోటక్ ఈక్విటీస్ సంస్థ వ్యాఖ్యానించింది. సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో రిలయన్స్ సంస్థ మార్కెట్ లీడర్ హోదాను కూడా కోల్పోయింది.