Real Estate Market Sentiment Dips in Q2 2021 Amidst COVID-19 Second Wave - Sakshi
Sakshi News home page

రియల్టీ భవిష్యత్తు ఏంటో?

Aug 21 2021 4:55 AM | Updated on Aug 21 2021 11:13 AM

Real estate market sentiment dips in Q2 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్‌–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్‌ స్కోర్‌ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది.

ఫ్యూచర్‌ సెంటిమెంట్‌ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్‌లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్‌లో సెంటిమెంట్‌ స్కోర్‌ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేగవంతం, నిరంతర ఆర్థిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్‌ స్కోర్‌ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశీర్‌ బైజాల్‌ తెలిపారు.

కరోనాతో రియల్టీ మార్కెట్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్‌ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది క్యూ2లో సర్వే పాల్గొన్న 40 శాతం మంది ఆఫీసు లీజు కార్యకలాపాలు వచ్చే ఆరు నెలల కాలంలో మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. క్యూ1లో ఇది 34 శాతంగా ఉంది. అలాగే 21 శాతం మంది ఆఫీస్‌ అద్దెలు పెరుగుతాయని.. 40 శాతం మంది స్థిరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. 2021 క్యూ2లో 50 శాతం మంది వచ్చే 6 నెలల్లో నివాస విక్రయాలు, లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement