హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ముకుతాడు | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ముకుతాడు

Published Wed, Jan 17 2024 5:46 AM

RBI proposes tighter norms for accepting public deposits by housing finance companies - Sakshi

ముంబై: ఆర్థిక అంశాల విషయంలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి  హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)లకు నిబంధనలను కఠినతరం చేయాలని బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌– రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్‌ డిపాజిట్ల మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఒక ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది.

కొన్ని నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తున్నట్లు ఒకవైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ఫిబ్రవరి 29వ తేదీలోపు ఈ ముసాయిదా పత్రంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది.  హెచ్‌ఎఫ్‌సీల డిపాజిట్ల చెల్లింపులకు సంబంధించి నిధుల లభ్యత అవసరాల నిర్వహణను మెరుగుపరచుకోవడంపై కూడా ఈ సర్క్యులర్‌లో ఆర్‌బీఐ దృష్టి సారించింది.

ప్రతిపాదిత తాజా ముసాయిదా ప్రకారం,  ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ క్రెడిట్‌ రేటింగ్‌లు లేని హెచ్‌ఎఫ్‌సీలు పబ్లిక్‌ డిపాజిట్‌లను స్వీకరించలేవు. అదే సమయంలో క్రెడిట్‌ కార్డ్‌ వ్యాపారంతో పాటు నిర్దిష్ట రుసుము ఆధారిత కార్యకలాపాలలోకి హెచ్‌ఎఫ్‌సీలను అనుమతించే అవకాశం ఉంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ముందస్తు అనుమతితో, రిస్క్‌ షేరింగ్‌ లేకుండా షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులతో కో–బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌లను జారీ చేయడానికి కొన్ని హెచ్‌ఎఫ్‌సీలకు అనుమతి లభిస్తోంది. ఇది రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి వర్తిస్తుంది. అటుపై దీనిపై సమీక్ష, దీనికి అనుగుణంగా తదుపరి అనుమతులు ఉంటాయి.   ప్రస్తుతం, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు  12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం (120 నెలల లోపు) తర్వాత తిరిగి చెల్లించే విధంగా  పబ్లిక్‌ డిపాజిట్లను ఆమోదించడానికి లేదా పునరుద్ధరించడానికి అనుమతిఉంది.

తక్షణం అమలు...
120 నెలల వరకూ డిపాజిట్ల ఆమోదం లేదా పునరుద్ధరణకు వీలుంది. దీనిని 5 సంవత్సరాలకు తగ్గించాలన్నది తాజా ముసాయిదా ఉద్దేశం. అయితే ఈ నిబంధన తక్షణం అమల్లోకి వచి్చనట్లు కూడా ఆర్‌బీఐ సర్క్యులర్‌ పేర్కొనడం గమనార్హం. ‘‘ఇకమీదట, ఈ సర్క్యులర్‌ తేదీ నుండి హెచ్‌ఎఫ్‌సీలు ఆమోదించిన లేదా పునరుద్ధరించిన పబ్లిక్‌ డిపాజిట్లను 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అయితే ఈ గడువు 60 నెలలకు పరిమితం అయ్యింది. అయితే ఇప్పటికే అరవై నెలల కంటే ఎక్కువ మెచ్యూరిటీతో ఉన్న డిపాజిట్లు ఆయా హెచ్‌ఎఫ్‌సీల  ప్రస్తుత రీపేమెంట్‌ ప్రొఫైల్‌ ప్రకారం తిరిగి చెల్లించడం జరుగుతుంది’’అని ఆర్‌బీఐ సర్క్యులర్‌ పేర్కొంది. ఒకవేళ ఆయా కంపెనీల క్రెడిట్‌ రేటింగ్‌ కనీస పెట్టుబడి గ్రేడ్‌ కంటే తక్కువగా ఉంటే, అటువంటి హెచ్‌ఎఫ్‌సీలు ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ పొందే వరకు ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్దరించలేవని, లేదా తాజా డిపాజిట్లను అంగీకరించలేవని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

  ఇక డిపాజిట్‌ తీసుకునే హెచ్‌ఎఫ్‌సీలు కలిగి ఉన్న పబ్లిక్‌ డిపాజిట్ల పరిమాణ సీలింగ్‌ (పరిమితి) ప్రస్తుతం తమ సొంత నికర నిధుల్లో 3 రెట్లు ఉంటే, దీనిని తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 1.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా, తాజా ముసాయిదా ప్రకారం వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రకృతి వైపరీత్యాలు/విపత్తుల కారణంగా ముందస్తు–మెచ్యూర్‌ ఉపసంహరణ అనుమతులకు హెచ్‌ఎఫ్‌సీలకు వీలుకలుగుతోంది.   

ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలతో సమన్వయం..
తాజా చర్యల ద్వారా ఇతర  నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) బాటలోకి హెచ్‌ఎఫ్‌సీలను తీసుకురావాలని భావిస్తోంది.  నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) నుండి హెచ్‌ఎఫ్‌సీల నియంత్రణను బదిలీ చేసిన తర్వాత, రిజర్వ్‌ బ్యాంక్‌ 2020 అక్టోబర్‌ 22వ తేదీన తొలిసారి ఈ సంస్థల కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. హెచ్‌ఎఫ్‌సీలు –ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనల మధ్య మరింత సమన్వయం తీసుకురావడం కోసం దశలవారీగా ప్రయత్నం జరుగుతుందని ఆర్‌బీఐ ఈ సందర్భంగా స్పష్ట చేసింది.

ఏప్రిల్‌ నుంచి తాజా  రుణ ‘చార్జీ’ నిబంధనల అమలు...
బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)రుణ ఎగవేతలపై జరిమానా చార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన సవరిత ‘ఫెయిర్‌ లెండింగ్‌ విధానం’ ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ సోమవారం తెలిపింది.బ్యాంకులు– నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్‌బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన  నిబంధనలను సవరించింది.

  దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లిపుల్లో వైఫల్యం వంటి  ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా చార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా చార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్‌ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి.  అటువంటి చార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ సూచనలు క్రెడిట్‌ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు.

Advertisement
 
Advertisement
 
Advertisement