ఎనిమిదోసారీ యథాతథమే!

RBI keeps repo rate unchanged, lowers CPI inflation forecast - Sakshi

అంచనాలకు అనుగుణంగా 4 శాతం రెపో రేటు కొనసాగింపు

దీనితో మరికొంతకాలం తక్కువ స్థాయిలోనే రుణ రేట్లు

పొదుపు పథకాలు, డిపాజిట్‌ రేట్లు పెరిగే అవకాశం శూన్యం

2021–22లో ఎకానమీ వృద్ధి 9.5 శాతం 

రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే చాన్స్‌

వార్షిక సగటు అంచనా 5.7 శాతం నుంచి 5.43 శాతానికి తగ్గింపు

అదనపు ద్రవ్య లభ్యతను వెనక్కు తీసుకోవడంపై దృష్టి  

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్‌బీఐ–ఎంపీసీ) అంచనాలకు అనుగుణంగా రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే– రెపో. ప్రస్తుతం 4 శాతంగా ఇది కొనసాగుతోంది. వృద్ధే లక్ష్యంగా వరుసగా ఎనిమిది ద్వైమాసికాల నుంచి ఆర్‌బీఐ సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. 2019లో రెపో రేటును ఆర్‌బీఐ 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం). 2020 మార్చి తర్వాత 115 బేసిస్‌ పా యింట్లు తగ్గించింది. గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజు ల సమావేశం అనంతరం శుక్రవారం ఎకానమీకి సంబంధించి నిర్ణయాల ప్రకటన వెలువడింది.  

కట్టడిలోకి ద్రవ్యోల్బణం  
రిటైల్‌ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్‌బీఐ అంచనాలతో  రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్‌బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగలు 5.7 శాతం  ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్‌ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్‌  ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్‌బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది.

వృద్ధి రేటుపై ధీమా...
ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్‌బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.  2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శాతం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది.  

ఎకానమీ సంపూర్ణ ప్రయోజనాలు కీలకం
తాజా పాలసీ సమీక్ష నేపథ్యంలో పొదుపు పథకాలు, బ్యాంకుల డిపాజిట్లపై ఆధారపడి జీవించే వారికి కొత్తగా వచ్చే ఆర్థిక ప్రయోజనం ఏదీ ఉండదు. వారికి యథాతథంగా సాధారణ వడ్డీరేట్లు మాత్రమే అందుతాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే మాత్రం వారు ప్రతికూల రిటర్న్స్‌ అందుకునే పరిస్థితి ఉంటుంది. ‘‘కుప్పకూలిపోతున్న లేదా క్షీణిస్తున్న మొత్తం ఆర్థిక వ్యవస్థకు మీరు మద్దతు ఇవ్వలేకపోతే, సీనియర్‌ సిటిజన్‌లతో సహా అందరికీ ఇతర ప్రధాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది’’ అని ఇదే విషయంపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టీ రబి శంకర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే పొదుపు పథకాలు ఇంకా నెగటివ్‌ రిటర్న్స్‌ ఏమీ ఇవ్వడం లేదని కూడా ఆయన విశ్లేíÙంచారు. ఈ సందర్భంగా ఆయన స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో ఏడాది డిపాజిట్‌ పథకాన్ని ప్రస్తావిస్తూ, ఇక్కడ డిపాజిట్‌ రేటు మార్గదర్శకాల ద్వారా వచి్చన వాస్తవ రేటు కంటే కనీసం 170–180 బేసిస్‌ పాయింట్లు ఎక్కువగా ఉందన్నారు.   

పెట్రో పన్నులపై ఆందోళన
పెట్రో ఉత్పత్తులపై పన్నుల తీవ్రత పట్ల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. బహిరంగంగా రెండవసారి ఈ అంశంపై మాట్లాడిన గవర్నర్, పప్పులు, వంటనూనెల వంటి నిత్యావసరాల సరఫరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.  

రాష్ట్రాలకు చేయూత
మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావాలకు గురయిన రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత విషయంలో ఎటువంటి సమస్యలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ‘వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ), ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌలభ్యం ద్వారా పెంచిన రుణ పరిమితులను అన్ని విధాలా కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.  మహమ్మారి ప్రారంభమైనప్పటి ఈ సమస్యతో పాటు అధిక రుణాల ఫలితంగా, రాష్ట్రాలు తమ బాండ్‌ హోల్డర్‌లకు అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి – ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రేటు దాదాపు  7 శాతానికి చేరువైంది. ఈ సమయంలో పలు రాష్ట్రాలు  డబ్ల్యూఎంఏ విండోను వినియోగించుకున్నాయి. జూలై నాటికి  ఈ సౌలభ్యం ద్వారా నిధుల రుణ పరిమాణం 35 శాతం పెరిగి రూ .92,000 కోట్లకు చేరింది.

ఉద్దీపనలను వెనక్కు... సంకేతాలు
కోవిడ్‌–19 నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపనలకు క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాలసీ సమీక్ష సూచించింది. ప్రస్తుతం వ్యవస్థలో రూ .9 లక్షల కోట్లకు పైగా ఉన్న అదనపు ద్రవ్యతను  ‘క్రమంగా‘ సర్దుబాట్లు చేయడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ సుముఖంగా ఉందని గవర్నర్‌ సూచించారు. మార్కెట్‌ నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను (బాండ్లు) కొనుగోలుకు సంబంధించిన జీఎస్‌ఏపీ (గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ అక్విజేషన్‌ ప్రొగ్రామ్‌)ను నిలుపుచేయడం జరిగిందని ఆయన తెలిపారు. వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత లేకుండా చూడ్డామే దీని ఉద్దేశ్యమని సూచించారు. గడచిన రెండు త్రైమాసికాల్లో జీఎస్‌ఏపీ కింద ఆర్‌బీఐ రూ.2.2 లక్షల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. కాగా, ఇదే సమయంలో  ఎకానమీ రికవరీకి తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో ఎప్పడూ కొనసాగేలా ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.  

బడా టెక్‌ ‘ఫైనాన్షియల్స్‌’పై కన్ను
గూగుల్, అమెజాన్‌ ద్వారా డిపాజిట్ల ఆమోదం నిర్దేశిత చట్టాలు, నిబంధనల ప్రకారం  ఉందో లేదో ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఆర్థిక రంగంలో బడా టెక్‌ సంస్థల కార్యకలాపాలపై ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ పే (ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌) ,   అమెజాన్‌ రెండూ తమ మొబైల్‌ ఫోన్‌ యాప్‌ల ద్వారా దేశంలో డిపాజిట్‌లను స్వీకరించడానికి రుణదాతలతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.  

రూ. 5 లక్షలకు ఐఎంపీఎస్‌..
ఐఎంపీఎస్‌ (ఇమీడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌) ద్వారా ప్రస్తుత లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా, దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం జరిగింది. డిజిటల్‌ లావాదేవీల పెంపు ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యం. ఐఎంపీఎస్‌ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది.

పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు...
► బ్యాంకులు తమ మిగులు నిల్వలను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేసినప్పుడు లభించే రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనుంది.  
► మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్, బ్యాంక్‌ రేట్‌ కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది.  
► ద్రవ్య లభ్యత, సర్దుబాటు లక్ష్యాలుగా అక్టోబర్‌ 8వ తేదీ నుంచి డిసెంబర్‌ 3 మధ్య పక్షం రోజుల ప్రాతిపదికన ఐదు 14 రోజుల వేరియబుల్‌ రేట్‌ రివర్స్‌ రెపో (వీఆర్‌ఆర్‌ఆర్‌) వేలాలను చేపట్టాలని ప్రతిపాదించింది.
► ఏటీఎంల్లో డబ్బు అందుబాటులో లేని సంద ర్భంల్లో ఆయా బ్యాంకులపై జరిమానా విధింపునకు ఉద్దేశించిన పథకాన్ని ఆర్‌బీఐ సమీక్షిస్తోంది. బ్యాంకర్ల నుంచి అందిన సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.  ఆగస్టులో ఈ జరిమానా విధానాన్ని ప్రకటిస్తే, అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.  
►  ఫైనాన్షియల్‌ మోసాల నివారణే లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పన జరగనుంది.  
► బ్యాంకుల తరహాలోనే బడా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎప్‌సీ) కస్టమర్ల సమస్యల పరిష్కారానికి అంతర్గత అంబుడ్స్‌మన్‌ యంత్రాంగం ఏర్పాటు కానుంది.  
► దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో గ్లోబల్‌బాండ్‌ ఇండిసీస్‌లో చేరే విషయంలో భారత్‌ ముందడులు వేస్తోంది.   ఆర్‌బీఐ, కేంద్రం  ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఇండెక్స్‌ ప్రొవైడర్లతో చర్చిస్తున్నాయి.  
► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరగనుంది.    

ఆఫ్‌లైన్‌లో రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపులు
దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ విధానంలో రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్‌బీఐ ప్రవేశపెట్టనుంది. ఇంటర్‌నెట్‌ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం రిటైల్‌ డిజిటల్‌ పేమెంట్లు జరిగేలా చర్యలు తీసుకోవడం ఈ ఫ్రేమ్‌వర్క్‌ ప్రధాన లక్ష్యం. చెల్లింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా అంగీకృత మౌలిక వ్యవస్థ బలోపేతానికి  జియో ట్యాగింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ విడుదల కానుంది.  

వృద్ధి సంకేతాలు పటిష్టమవుతున్నాయ్‌
వృద్ధి కిరణాలు విస్తరిస్తుండడం, ఇందుకు సంకేతాలు పటిష్టమవుతుండడాన్ని ఆర్‌బీఐ గమనిస్తోంది.  రైల్వే రవాణా, పోర్ట్‌ కార్యకలాపాలు, సిమెంట్‌ ఉత్పత్తి, విద్యుత్‌ డిమాండ్, ఈ– వే బిల్లుల మెరుగుదల, జీఎస్‌టీ, టోల్‌ భారీ వసూళ్ల వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.  దీర్ఘకాలం వృద్ధి పటిష్ట ధోరణి కొనసాగడానికి సరళతర ఆర్థిక విధానాన్నే కొనసాగించాలని ఆర్‌బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది.      
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top