రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్బీఐ భారీ షాక్‌!

Rbi Decided To Reduce The Ways And Means Advances - Sakshi

ముంబై: మహమ్మారి కరోనా పరిస్థితిలో మెరుగుదల దృష్ట్యా, రాష్ట్రాలు– కేంద్ర పాలిత ప్రాంతాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌లను (డబ్ల్యూఎంఏ) రూ.51,560 కోట్ల నుంచి రూ.47,010 కోట్లకు తగ్గించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం నిర్ణయించింది.

ఆదాయాలు– చెల్లింపులకు మధ్య అసమతుల్యతను నివారించడానికి ప్రభుత్వాలకు ఆర్‌బీఐ ఇచ్చే తాత్కాలిక అడ్వాన్‌లే  వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌. కోవిడ్‌–19కి సంబంధించిన అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని, ఆర్‌బీఐ అన్ని రాష్ట్రాలకు డబ్ల్యూఎంఏ పరిమితిని రూ.51,560 కోట్లకు పెంచింది. ఇది మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంది. కోవిడ్‌–19 నియంత్రణలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూఎంఏ, ఓవర్‌ డ్రాఫ్ట్‌ టైమ్‌లైన్‌ను  యథాస్థితికి తీసుకురావాలని ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్ణయించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారిక ప్రకటన తెలిపింది.  

నేటి నుంచి అమల్లోకి... 
2022 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పొందే స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌)... భారత ప్రభుత్వం జారీ చేసిన  సెక్యూరిటీలలో వారి పెట్టుబడుల పరిమాణానికి అనుసంధానమై ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది.  స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌పై వడ్డీ రేటు రిజర్వ్‌ బ్యాంక్‌  పాలసీ రేటు– రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) ముడిపడి ఉంటుందని పేర్కొంది. అడ్వాన్స్‌ బకాయి ఉన్న అన్ని రోజులకు వడ్డీని వసూలు చేయడం జరుగుతుందని కూడా తెలిపింది. కాగా,  2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో భారత ప్రభుత్వానికి వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ పరిమితి రూ. 1,50,000 కోట్లుగా ఆర్‌బీఐ నిర్ణయించింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top