ఆ విషాదంపై రతన్‌ టాటా భావోద్వేగం​

Ratan Tata soul stirring post on 12 years of Mumbai terror attack - Sakshi

సాక్షి,ముంబై: టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా 12 ఏళ్ల నాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ముంబై నగరంలో నవంబరు 26న చోటుచేసుకున్న మారణహోమంపై  సోషల్‌ మీడియాలో  గురువారం స్పందించారు. ఈ సందర్భంగా  ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన అమరవీరులకు,  ప్రజలకు రతన్‌ టాటా నివాళులర్పించారు.

12 సంవత్సరాల క్రితం జరిగిన అవాంఛనీయ విధ్వంసాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటూ తీవ్ర విషాదానికి చేదు జ్ఞాపకంగా నిలిచిన తాజ్‌మ‌హ‌ల్ ప్యాలెస్ హోట‌ల్‌ పెయింటింగ్‌ను షేర్‌ చేశారు. అయితే అంతకన్నా గుర్తుండిపోయే విషయం ఏమిటంటే,  విభిన్నజాతుల సమ్మేళనమైన ముంబై ప్రజలంతా అన్ని తేడాలను పక్కనపెట్టి, ఉగ్రవాదాన్ని, విధ్వంసాన్ని అధిగమించారంటూ ప్రశంసించారు. ఆప్తులను కోల్పోవడం దుఃఖభరితమే అయినా, శత్రువును జయించడంలో వారి, ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవించి తీరాలి. వారి తెగువను, ఐక్యతను మెచ్చుకోవాలన్నారు. ఆ రోజు వారు ప్రదర్శించిన సాహ‌సం, సున్నిత‌త్వం భ‌విష్య‌త్తులోనూ కొనసాగాలని రతన్ టాటా  తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా 2008, న‌వంబ‌ర్ 26వ తేదీన ముంబై నగరంపై ఉగ్ర‌వాదులు విరుచుకుపడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగినఈ దారుణ మారణహోమంలో 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా తాజ్‌ హోట‌ల్‌లోనే 31 మంది మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top