
ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్‌లు నమోదవుతున్నాయన్నారు.
ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్‌ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment