అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు..! త్వరలోనే..!

Rakesh Jhunjhunwala Plans Ultra Low Cost Airline With 70 Aircraft - Sakshi

ముంబై: ది ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా పలు రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. తాజాగా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో  సుమారు 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కొత్త ఎయిర్‌లైన్‌ను మొదలుపెట్టాడానికి  ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్‌ జున్‌జున్‌వాలా ప్రకటించారు. భారత్‌లో తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న విమానయాన రంగంలో సుమారు 35 మిలియన్‌ డాలర్లను  ఇన్వెస్ట్‌  చేయనున్నారు. 

ఎయిర్‌లైన్‌  కంపెనీలో సుమారు 40 శాతం మేర వాటాను రాకేష్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే పదిహేను రోజుల్లో భారత విమానయాన శాఖ నుంచి నో  ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓ సీ ) రానుందని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్‌ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. కాగా రాకేష్‌ మొదలుపెడుతున్న సొంత ఎయిర్‌లైన్‌ ‘ఆకాశ ఎయిర్‌’ అని తెలుస్తోంది. గతంలో డెల్టా ఎయిర్‌ లైన్స్‌లో పనిచేసిన మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, పలు సభ్యులు కూడా  కంపెనీలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా కొనబోయే ఎయిర్‌క్రాఫ్ట్స్ సామర్ధ్యం 180 ప్యాసింజర్ల వరకూ ఉండబోతోంది.  అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి రానుంది. కోవిడ్‌ మహమ్మారి రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యింది. అయితే రాబోయే రోజుల్లో భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రాకేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

కరోనా మహమ్మారికి ముందే, భారతదేశంలోని విమానయాన సంస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012 లోనే తన కార్యకలాపాలను ముగించింది. దాంతో పాటుగా ఇటీవల జెట్ ఎయిర్‌వేస్ ఇండియా లిమిటెడ్ విమాన ప్రయాణాలను ఆమోదం వచ్చిన కొన్ని రోజులకే 2019లో తన ఆపరేషన్లను నిలిపివేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top