మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్స్ కోసం టాప్‌ ఇన్వెస్టర్‌

Rakesh Jhunjhunwala apply for mutual fund licenses - Sakshi

మ్యూచువల్‌ ఫండ్‌  సంస్థ   ఏర్పాటు బాటలో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా

సమీర్‌ అరోరా కంపెనీసైతం సెబీకి దరఖాస్తు 

ఫండ్‌ రేసులో బజాజ్‌ ఫిన్‌సర్వ్, జిరోధా బ్రోకింగ్‌

లైసెన్స్‌ కోసం వేచిచూస్తున్న పలు కంపెనీలు

సాక్షి,ముంబై: సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఏర్పాటు బాట పట్టారు. ఇందుకు అనుమతించ మంటూ రాకేష్‌ సంస్థ ఆల్కెమీ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఆల్కెమీ క్యాపిటల్‌కు రాకేష్‌ సహవ్యవస్థాపకుడుకాగా.. సమీర్‌ అరోరా ఏర్పాటు చేసిన హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సైతం ఎంఎఫ్‌ లైసెన్స్‌ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్స్‌ల కోసం హీలియోస్‌ క్యాపిటల్‌ గత నెల 25న, ఆల్కెమీ క్యాపిటల్‌ జనవరి 1న సెబీకి దరఖాస్తు చేశాయి. 

పీఎంఎస్‌ సేవలు 
అటు సింగపూర్, ఇటు దేశీ నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్‌ అయిన హీలియోస్‌ క్యాపిటల్‌.. ఇండియా ఫోకస్‌డ్‌ లాంగ్‌– షార్ట్, లాంగ్‌ ఓన్లీ ఫండ్‌ను నిర్వహిస్తోంది. గ్లోబల్‌ లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ ఫండ్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇక హీరేన్‌ వేద్, అశ్విన్‌ కేడియా, లసిత్‌ సంఘ్వీ సైతం వ్యవస్థాపకులుగా కలిగిన ఆల్కెమీ క్యాపిటల్‌.. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు,ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్టులను నిర్వహిస్తోంది. 

కాగా బజాజ్‌ ఫిన్‌సర్వ్, క్యాపిటల్‌మైండ్‌ (వైజ్‌మార్కెట్స్‌ అనలిటిక్స్‌), ఫ్రంట్‌లైన్‌ క్యాపిటల్‌ సర్వీసెస్, యూనిఫై క్యాపిటల్, జిరోధా బ్రోకింగ్‌ తదితర కంపెనీలు సైతం ఎంఎఫ్‌ లైసెన్స్‌ను పొందేందుకు వేచిచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  ఇప్పటికే సెబీ వద్ద పలు కంపెనీల దరఖాస్తులు  పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జులై మొదలు ఇటీవలివరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఈక్విటీ మార్కెట్ల రికార్డు గరిష్టాల నేపథ్యంలోనూ పలు ఫండ్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడం, పోర్ట్‌ఫోలియోలను  పునర్‌నిర్మించు కోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు వివరించారు.
      

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top