రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్థ్ధిక వ్యవహారాల్లో అవకతవకలు
ఐదేళ్లలో రూ. 15 లక్షల కోట్ల అదనపు ఆదాయం మిస్టరీ
బంగారం పేరుతో బిలియన్ డాలర్ల బోగస్ లెక్కలు
ప్రమోటర్ రాజేష్ మెహతాపై నిషేధం
పారదర్శకంగా ఆర్థిక ఫలితాలు దాఖలు చేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగంలో మరో భారీ అకౌంటింగ్ వివాదానికి తెరలేచింది. పసిడి రిఫైనరీ, ఆభరణాల తయారీ లిస్టెడ్ కంపెనీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్(ఆర్‌ఈఎల్)కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకిచ్చింది. ఆర్థిక ఫలితాల వెల్లడిలో అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో ఆర్‌ఈఎల్ ప్రమోటర్, సీఈవో రాజేష్ మెహతాను కంపెనీ సెక్యూరిటీల లావాదేవీలు చేపట్టకుండా నిషేధించింది.
అంతేకాకుండా సంబంధిత పార్టీ లావాదేవీలు తదితర వివరాలతోపాటు పారదర్శకంగా వాస్తవిక ఆర్థిక ఫలితాలను సమర్పించాలని ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీల నిబంధనల (ఎల్‌వోడీఆర్)కు అనుగుణంగా వీటిని ప్రకటించాలని సూచించింది. వివరాల్లోకి వెళితే .. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ఐదేళ్ల వ్యవధిలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 15 లక్షల కోట్లకు పైగా ఆదాయాన్ని అదనంగా చూపించినట్లు మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది.
ఇందుకు పబ్లిక్‌కు అందుబాటులోలేని విదేశీ అనుబంధ సంస్థలను వినియోగించుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ ప్రకటించిన కన్సాలిడేటెడ్ ఫలితాలకు, గ్రూప్‌లో కీలకమైన స్విట్జర్లాండ్ కంపెనీ వాల్కంబీ స్టాండెలోన్ ఆర్థిక ఫలితాలకు పొంతనే లేదని వ్యాఖ్యానించింది. సంస్థ ఐదేళ్లలో రూ. 15 లక్షల కోట్లకుపైగా ఆదాయాన్ని అదనంగా చూపించగా, ప్రధానమైన వాల్కంబీ స్టాండెలోన్ ఆదాయం అత్యంత తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. వెరసి ప్రాథమిక పరిశీలన ప్రకారం కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని వివరించింది.
99.8 శాతం తేడా ..
సెబీ సమాచారం ప్రకారం రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 కాలంలో రూ. 15.18 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ప్రకటించింది. దీనిలో సుమారు రూ. 15.15 లక్షల కోట్లు .. అంటే 99.8 శాతం అనుబంధ సంస్థల ద్వారా అందుకున్నట్లు పేర్కొంది. అయి తే, గ్రూప్‌లోని ప్రధాన అనుబంధ సంస్థ వాల్కంబీ ఎస్‌ఏ ఆడిటెడ్ స్టాండెలోన్ ఆర్థిక ఫలితాలకు అనుగుణంగా వీటిని సమన్వయం చేయలేకపోయింది.
బంగారాన్ని శుద్ధిచేసే (రిఫైనర్) ఈ సంస్థ రిఫైనింగ్ సర్వీసులు, బ్రాండెడ్ బంగారు ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆదాయం అందుకుంటోంది. స్విస్ చట్టాల ప్రకారం కేపీఎంజీ ఆడిట్ చేసిన స్టాండెలోన్ ఫలితాల్లో వాల్కంబీ.. ప్రాసెసింగ్ చార్జీలు లేదా విలువ జోడింపును మాత్రమే ఆదాయంగా నమోదు చేసింది. ఈ గణాంకాలకు, ఆర్‌ఈఎల్‌సహా .. ఇంటర్మిడియరీ హోల్డింగ్ కంపెనీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ (జీజీఆర్) ప్రకటించిన ఆడిటెడ్ ఫలితాలు, ఆదాయాలకు మధ్య భారీ వ్యత్యాసాలున్నట్లు సెబీ గుర్తించింది.
వాల్కంబీ ఆదాయం కేవలం రూ. 543 కోట్లే..
2023 కేలండర్ ఏడాదిలో వాల్కంబీ స్టాండెలోన్ ఆదాయం రూ. 543 కోట్లు మాత్రమే. అయితే జీజీఆర్ రూ. 2.93 లక్షల కోట్లు, ఆర్‌ఈఎల్ రూ. 2.81 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ప్రకటించాయి. వెరసి వాల్కంబీ స్టాండెలోన్ ఆదాయం దీనిలో 0.5 శాతంగా లెక్కతేలుతోంది. దీంతో సొంతంగా ఎలాంటి నిర్వహణా కార్యకలాపాలులేని హోల్డింగ్ కంపెనీ కొన్ని లక్షల కోట్ల రూపాయల స్థూల లావాదేవీల వి లువను ఎలా ప్రకటించిందీ ప్రశ్నార్థకమని సెబీ పేర్కొంది.
అది కూడా అనుబంధ సంస్థ ప్రాసె సింగ్ ఫీజును మా త్రమే ఆదాయంగా నమోదు చేస్తున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జీజీఆర్ ప్రాసెసింగ్ చార్జీలతోపాటు.. స్థూల పసిడి లావాదేవీల విలువను సైతం నమోదు చేస్తుందని ఆర్‌ఈఎల్ వాదించినప్పటికీ, ప్రాథమిక పరిశీలన ప్రకారం ఇది అసంబద్ధంగా ఉన్నట్లు సెబీ పేర్కొంది. వీటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను ఆర్‌ఈఎల్ అందించలేకపోయినట్లు వెల్లడించింది. విలువ జోడింపు మాత్రమే చేస్తూ, ఇతర సంస్థలకు చెందిన వస్తువుల విలువ ను ఆదాయంగా ఎలా పరిగణిస్తారని 109 పేజీల ఆదేశాలలో సెబీ ప్రశ్నించింది.
షేరు బేర్ .. 5% పతనం ..
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై సెబీ మధ్యంతర ఉత్తర్వులు స్టాక్ మార్కెట్లో కలకలంరేపాయి. ఉన్నట్టుండి ఈ కౌంటర్ లో అమ్మకందారులు పెరిగిపోవడంతోపాటు.. కొనేవాళ్లు కరువవడంతో బీఎస్‌ఈలో 5% లోయ ర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి షేరు రూ. 5.5% నష్టపోయి రూ. 105 దిగువన ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 5%
దిగజారి రూ. 104 వద్ద నిలిచింది.
వాటాదారు ఫిర్యాదుతో వెలుగులోకి..
కంపెనీ ఆర్థిక ఫలితాల అక్రమాలపై 2024 మార్చిలో ఆర్‌ఈఎల్ వాటాదారుడొకరు సెబీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు దిగడం గమనార్హం! 2020 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకూ నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తప్పు చేయలేదు
ఆదాయాలను అధికంచేసి చూపలేదని, ఎలాంటి ఆర్థిక అవకతవకలకూ పాల్పడలేదని ఆర్‌ఈఎల్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇది నియంత్రణ సంస్థకు, కంపెనీకి మధ్య ఒక విధమైన కమ్యూనికేషన్ అంతరం మాత్రమేనని పేర్కొంది. కంపెనీ ప్రకటించిన ఫలితాలు సరైనవేనని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలియజేసింది. సెబీ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిందే తప్ప ఎలాంటి నిర్ధారణకూ రాలేదని వివరించింది. ఇందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లనూ సెబీకి దాఖలు చేసే కార్యాచరణలో ఉన్నట్లు తెలియజేసింది.


