రైళ్లలో టీసీలకు కొత్త ‘లుక్కు’.. టెక్కు! | Railway Ticket Checking High Tech Mumbai New Jackets with Body Cameras | Sakshi
Sakshi News home page

రైళ్లలో టీసీలకు కొత్త ‘లుక్కు’.. టెక్కు!

Oct 10 2026 12:26 PM | Updated on Oct 10 2026 12:52 PM

Railway Ticket Checking High Tech Mumbai New Jackets with Body Cameras

సాధారణంగా రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేసే టీసీలంటే తెల్లక చొక్కా, నల్ల ప్యాంటు, పైన ఓ నల్లని కోటు వేసుకుని కనిపిస్తారు. కానీ పశ్చిమ రైల్వే ముంబై డివిజన్‌ పరిధిలోని టీసీలు మాత్రం కొత్త ‘లుక్కు’.. టెక్కుతో కనిపిస్తున్నారు. పశ్చిమ రైల్వే (వెస్ట్రన్‌ రైల్వే) పరిధిలోని ముంబై డివిజన్‌ రైలు టికెట్లను తనిఖీలో కొత్తదనానికి శ్రీకారం చుట్టింది.  

అత్యంత రద్దీగా ఉండే ముంబై రైళ్లలో టికెట్ తనిఖీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పశ్చిమ రైల్వే అప్ గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా టికెట్ తనిఖీ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను ప్రవేశపెట్టింది. ఈ జాకెట్‌లో ఇంటిగ్రేటెడ్ బాడీ కెమెరాతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచుకోవడం కోసం పాకెట్లు ఉంటాయి. పైలట్ ప్రాజెక్ట్‌ కింద ప్రస్తుతం 30 జాకెట్లను సిబ్బందికి అందజేసింది. టీసీలు వీటిని ధరించి రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్నారు.

జాకెట్ల ప్రత్యేకతలు

టీసీలకు అందించిన కొత్త జాకెట్లను పలు ప్రత్యేకతలతో రూపొందించారు. విధుల్లో ఉన్న టీసీల వద్ద టికెట్లను తనిఖీ చేసే హ్యాండ్-హెల్డ్ టెర్మినల్స్, ఎలక్ట్రానిక్ ఫేర్ కలెక్షన్‌ మెషీన్లు, వాయిస్ యాంప్లిఫైయర్లు ఉంటాయి. వీటిని తమతో తీసుకెళ్లడానికి టీసీలు ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు లేకుండా వీటిని పెట్టుకోవడానికి ఈ జాకెట్లలో ప్రత్యేక జేబులు ఇచ్చారు. అలాగే హెడ్ సెట్ పెట్టుకునేందుకూ ప్రత్యేక ఏర్పాటు ఉంది.

ఇక కొత్త జాకెట్ ప్రధాన ఫీచర్లలో ఒకటి దాని ఇంటిగ్రేటెడ్ బాడీ కెమెరా. టికెట్ తనిఖీ సిబ్బంది, ప్రయాణీకుల మధ్య పరస్పర చర్యలకు మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఈ కెమెరా ఉద్దేశం. టికెట్‌ తనిఖీ సమయంలో టీసీలు, ప్రయాణికుల మధ్య జరుగుతున్నదంతా ఈ బాడీ కెమెరా రికార్డ్‌ చేస్తుంది. దీంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం గానీ, ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం గానీ కట్టడి చేసేందుకు వీలవుతుంది. అంటే ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్న మాట!

ఈ ప్రయోగాత్మక చొరవ విజయవంతమైతే ముంబై డివిజన్‌ వ్యాప్తంగా మరింత మంది టికెట్ తనిఖీ సిబ్బందికి ఈ జాకెట్లను అందించడాన్ని వెస్ట్రన్‌ రైల్వే పరిగణించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement