మన రూపాయి పవర్‌ ఏంటో చూపించాలి - ‍ప్రధాని మోదీ

PM Narendra Modi launches Jan Samarth portal for credit-linked schemes - Sakshi

ప్రపంచ వాణిజ్యంలో కీలకంగా మన కరెన్సీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష

జన్‌ సమర్థ్‌ పోర్టల్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలో భారతీయ బ్యాంకులను, కరెన్సీని కీలక భాగంగా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడంపై ఆర్థిక సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘మన దేశీ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల నిర్వహణలో వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు.  

ఇదే సందర్భంగా ’జన్‌ సమర్థ్‌’ పోర్టల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 13 రకాల ప్రభుత్వ రుణాల స్కీములకు సంబంధించిన పోర్టల్‌గా ఇది పని చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు జన్‌ సమర్థ్‌ తోడ్పడుతుంది. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పడగలదు‘ అని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సర్వీసులను అందించేందుకు అనువైన అనేక ప్లాట్‌ఫామ్‌లను భారత్‌ అభివృద్ధి చేసిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.  

ప్రత్యేక నాణేల సిరీస్‌ ఆవిష్కరణ..
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సిరీస్‌ నాణేలను ప్రధాని ఆవిష్కరించారు. రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఇవి ఉంటాయి. వీటిపై ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (ఏకేఏఎం) డిజైన్‌ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, యథాప్రకారం చెలామణీలో ఉంటాయని ప్రధాని తెలిపారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించేందుకు కొత్త సిరీస్‌ నాణేలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top