
ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ లేని పెట్రోలును ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్ర అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సౌకర్యం కల్పించకపోవడం 2019 నాటి వినియోదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకూ పెట్రోలులో కలిపే ఇథనాల్ మోతాదు పది శాతం మాత్రమే ఉండగా.. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దీన్ని ఇరవై శాతానికి పెంచారు. అయితే చౌక ఇథనాల్‌ను కలుపుతున్నా అంతమేరకు పెట్రోలు ధరలు తగ్గకపోవడంపై, ఈ-20 పెట్రోలు కారణంగా తమ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన వాహనాలు, కాలుష్య నివారణ మార్గదర్శకాలు బీఎస్-6లు రెండింటికీ ఈ ఈ-20 పెట్రోలు అనుకూలంగా లేదన్నది ఆరోపణ. ఈ-20 ఇథనాల్ ఇంజిన్ భాగాలను దెబ్బతీస్తుందని, సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా తుప్పు పట్టేందుకు అవకాశాలు ఎక్కువ చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ససేమిరా అంటూండటం గమనార్హం.
వినియోగదారుల అవగాహన
పెట్రోల్ కంటే తక్కువ ధరకు ఇథనాల్ లభిస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా పెట్రోలు ధరలు తగ్గించలేదని పిటిషనర్ ఆరోపించారు. పెట్రోలు బంకుల్లో లభిస్తున్నది ఇథనాల్ కలిపినదా? కాదా? అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని తగిన లేబలింగ్, ప్రకటనలు లేకపోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇథనాల్ లేని పెట్రోలును కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిందీ పిటిషన్. ఇథనాల్ లేదా ఇతర పదార్థాలను కలిపి అందిస్తూంటే ఆ విషయాలను స్పష్టం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఇథనాల్ లేని పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతోపాటే మిశ్రమం ఎంత? ఏ ఏ పదార్థాలను కలిపింది కూడా పెట్రోలు బంకుల్లో స్పష్టంగా ప్రకటించాలని... ఆయా వాహనాలు మిశ్రమ ఇంధనానికి అనువైనవా? కావా? అన్న సమాచారాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. ఈ-20 పెట్రోలు వాడకం ప్రభావం వాహనాలపై ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అభ్యర్థించింది.
ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు