సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిల్ వేసింది. పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గతంలో దాఖలైన పిటిషన్లను కలిపి విచారిస్తామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.
పిల్‌లో కీలక అంశాలు..
ఏపీలో ఉన్న 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని.. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదని పిల్‌లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ‘‘ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించటానికి వీటి ఏర్పాటు జరిగింది. మెడికల్ కాలేజీల నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించింది. మెడికల్ కళాశాలల్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్‌కి కేటాయించి ఆ డబ్బును ఆసుపత్రులకు వాడే విధంగా మార్గదర్శకాలు అప్పటి ప్రభుత్వం రూపొందించింది’’ అని కోర్టుకు వైఎస్సార్‌సీపీ తెలిపింది.
అనుబంధ పిటిషన్ దాఖలు..
టెండర్లు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్‌ను కూడా వైఎస్సార్‌సీపీ దాఖలు చేసింది. పీపీపీ వల్ల వైద్య విద్య దూరం అవటమే కాకుండా విద్యా, వైద్యం పేద ప్రజలకు దక్కకుండా కొనుక్కునే పరిస్థితి వస్తుందని పిల్‌లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఆర్థికంగా భారం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది వాస్తవం కాదన్న వైఎస్సార్‌సీపీ.. ప్రజా ప్రభిప్రాయం కోసం కోటి సంతకాలు కూడా తెలియజేస్తునట్టు కోర్టుకు తెలిపింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ను వైఎస్సార్‌సీపీ చేర్చింది.


