విద్యుత్‌కు భారీ డిమాండ్‌ | Peak power demand to grow by 15GW per year for next 6 years: Srikanth Nagulapalli | Sakshi
Sakshi News home page

విద్యుత్‌కు భారీ డిమాండ్‌

Aug 25 2024 9:16 AM | Updated on Aug 25 2024 9:16 AM

 Peak power demand to grow by 15GW per year for next 6 years: Srikanth Nagulapalli

న్యూఢిల్లీ: విద్యుత్‌కు దేశంలో డిమాండ్‌ ఏటా భారీగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏటా 11 గిగావాట్ల చొప్పున డిమాండ్‌ పెరగ్గా.. వచ్చే ఆరేళ్ల పాటు ఏటా 15 గిగావాట్ల మేర అధికం అవుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ అదనపు సెక్రటరీ శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. సుమారు 40 గిగావాట్లు స్టోరేజ్‌ రూపంలో ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి రోజులో సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయంలో (సోలార్‌ హవర్స్‌) అదనంగా 85 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తోడవుతుంది. 

అదే నాన్‌ సోలార్‌ హవర్స్‌లో 90 గిగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదవుతుంది’’అని శ్రీకాంత్‌ వెల్లడించారు. 2030 నాటికి స్టోరేజ్‌ సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి వస్తుందన్నారు. సోలార్‌ హవర్స్‌లో నిల్వ చేసిన విద్యుత్‌ను, నాన్‌ సోలార్‌ హవర్స్‌లో వినియోగించుకోవచ్చన్నారు. ఐఈఈఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, సోలార్, పవన (విండ్‌), స్టోరేజ్, ప్రసారం సామర్థ్యాల విస్తరణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు.
 
300 గిగావాట్ల లక్ష్యం.. 
2030 నాటికి శిలాజ ఇంధనేతర మార్గాల ద్వారా (పునరుత్పాదక/పర్యావరణ అనుకూల) 500 గిగావాట్ల విద్యుత్‌ సామర్థ్యాన్ని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో 200 గిగావాట్ల విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించినట్టు శ్రీకాంత్‌ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 300 గిగావాట్ల సామర్థ్యం ఆచరణలోకి వస్తుందన్నారు. ఇందులో 225 గిగావాట్లు కేవలం సోలార్, పవన విద్యుత్‌ రూపంలో ఉంటుందని తెలిపారు. సోలార్‌ సామర్థ్యం దండిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలతో కూడిన ఆర్‌ఈ జోన్‌లలో సామర్థ్యం ఎక్కువగా వస్తుందన్నారు. 

గుజరాత్, తమిళనాడు తీరాల్లో ఆఫ్‌షోర్‌ (సముద్ర జలాలు) విండ్‌ ఫార్మ్‌లు, ఒడిశా, గుజరాత్, తమిళనాడు తీరాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ సామర్థ్యాల ఏర్పాటు ప్రణాళికలను సైతం వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు), డేటా కేంద్రాల రూపంలోనూ విద్యుత్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరగబోతోందన్నారు.  దేశం మొత్తాన్ని ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ఒకే గ్రిడ్‌తో అనుసంధానించడం వల్ల 170 గిగావాట్ల విద్యుత్‌ను, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయొచ్చన్నారు. పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీకాంత్‌ వెల్లడించారు. ‘‘40 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌(బీఈఈఎస్‌)ను, 19 గిగావాట్ల పీఎస్‌పీ సామర్థ్యాన్ని ఆరేళ్లలో సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement