పేటీఎం రీ‘సౌండ్‌’! భారీగా పెరిగిన సౌండ్‌ బాక్స్‌ సబ్‌స్క్రైబర్లు

paytm reports 118 pc growth in merchants subscribing payment devices during april may - Sakshi

డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ పేమెంట్‌ పరికరాల (సౌండ్‌ బాక్స్‌లు)  ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే నెల చివరి నాటికి సౌండ్‌బాక్స్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను ఏకంగా 118 శాతం పెంచుకుంది. 

సౌండ్‌బాక్స్, పాయింట్-ఆఫ్-సేల్ (పీవోఎస్‌) మెషీన్‌ల వంటి పరికరాల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో 75 లక్షలకు పెరిగినట్లు ఓ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వన్‌97 సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఏప్రిల్, మే నెలల్లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 34 లక్షలు ఉండేది. ఈ సంవత్సరం మే నెలలోనే 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కొత్తగా చేరడం గమనార్హం.

మార్చి త్రైమాసికంతో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సాధించిన పేటీఎం అంతకుముందు ఆర్థక సంవత్సరంలో 29 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండేది. అంటే 134 శాతం వృద్ధిని సాధించింది. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు కాకుండా అదనపు చెల్లింపు మానిటైజేషన్ ఛానెల్‌ని ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో పేటీఎం ఈ వృద్ధిని సాధించింది. మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు అంటే వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రేటు. 

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం మర్చంట్‌ చెల్లింపులు 35 శాతం వృద్ధితో రూ. 2.65 లక్షల కోట్లకు పెరిగాయి.  అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్,  మే నెలల్లో పేటీఎం అందించిన రుణాలు రూ. 9,618 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇవే నెలల్లో రూ. 3,576 కోట్లు ఉండగా 169 శాతం పెరిగాయి.

ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్‌! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top