కృత్రిమ మేధస్సు(AI)తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ వ్యవస్థలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. సుమారు ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకదానిలో 50 శాతం కంటే ఎక్కువ పనులు జనరేటివ్ ఏఐ (GenAI) ద్వారా అభివృద్ధి (ఆగ్మెంటేషన్) చెందే అవకాశం ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర ఉద్యోగ ధోరణులపై చేసిన ఈ అధ్యయనం.. వేగంగా మారుతున్న భారతీయ జాబ్ మార్కెట్‌కు కూడా వర్తిస్తుంది. రాబోయే కాలంలో పని విధానంలో రాబోయే నిర్మాణాత్మక మార్పులకు సిద్ధంగా ఉండాలని పరిశ్రమలను ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
భారతీయ వర్సిటీ భాగస్వామ్యం
మిన్నెసోటాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్, నార్త్ స్టార్ పాలసీ యాక్షన్ సంస్థలతో కలిసి భారత్‌కు చెందిన వోక్సెన్ విశ్వవిద్యాలయం ఏఐ రీసెర్చ్ సెంటర్ (AIRC) ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా రూపొందించిన 'GenAI Job Intelligence Dashboard' విధాన నిర్ణేతలకు, పరిశ్రమలకు దిక్సూచిలా మారనుంది. వోక్సెన్ ఎంబీఏ విద్యార్థులు సాక్షి పాఠక్, హేమాంగ్ జోషి ఈ డ్యాష్‌బోర్డ్ రూపకల్పనలో డా. అమిత్ కుమార్ బాల్, డా. పూజిత కొండపాకల మార్గదర్శకత్వంలో పాలుపంచుకున్నారు. సంక్లిష్టమైన ఉద్యోగ డేటాను సులభంగా అర్థమయ్యేలా విశ్లేషించే ఈ ప్లాట్‌ఫామ్, ఏఐ ప్రభావం చూపే ఉద్యోగాలను గుర్తించడంలోనూ, మారుతున్న నైపుణ్య అవసరాలను ట్రాక్ చేయడంలోనూ సహాయపడనుంది.
ఈ అధ్యయనం ప్రకారం, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన కంటే, పనుల స్వరూపం మారుతుందనే అంశాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏఐ అంటే ఉద్యోగ నష్టం కాదు, పనుల పునర్నిర్వచనం, కొత్త అవకాశాల సృష్టి’ అని వోక్సెన్ ఏఐ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. హేమచంద్రన్.కె పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోలేని సంస్థలు భవిష్యత్తులో వెనుకబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వర్క్‌ఫ్లో మార్పులు, డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రతిభా వ్యూహాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
రీ-స్కిల్లింగ్ అనివార్యం!
వ్యాపార సంస్థలు ఏఐని విస్తృతంగా అవలంబిస్తున్న తరుణంలో రీ-స్కిల్లింగ్ (మళ్లీ నైపుణ్యం పొందడం), మానవ వనరుల ప్రణాళిక, విద్యా విధానాల సమన్వయం అత్యవసరంగా మారాయి. విద్యాసంస్థలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, వోక్సెన్ విద్యార్థుల మాదిరిగా నిజజీవిత డేటాతో పని చేస్తూ భవిష్యత్ సవాళ్లకు సిద్ధం కావాలని ఈ ప్రాజెక్టు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో, ఆవిష్కరణలకు, ఉద్యోగుల సంక్షేమానికి మధ్య సమతుల్యత పాటిస్తూ, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ అధ్యయనం ప్రభుత్వాలను, సంస్థలను కోరుతోంది.


