సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం

Ola Electric Upcoming e Scooter Revealed - Sakshi

ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 500 ఎకరాల స్థలంలో మెగా ఫ్యాక్టరీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో నిర్మిస్తున్నారు. ఈ కొత్త ఫ్యాక్టరీ భారతదేశంలోని డిమాండ్‌ను తీర్చడమే గాక "ఓలా ఎలక్ట్రిక్" ఎగుమతి కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఈ కొత్త ప్లాంట్‌లో తయారు చేసిన వాహనాలను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు. ఒక కోటి వాహనాలను ఏడాది కాలంలో తయారు చేయగల సామ‌ర్థ్యంతో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి కార్య‌క‌లాపాలు 2022 సంవత్సరంలో ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఓలా కంపెనీ త‌న రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వివ‌రాల‌ను వెల్లడించింది. ఓలా గత ఏడాది మేలో నేద‌ర్లాండ్ ఆమ్‌స్టర్ ‌డామ్‌ ఆధారిత ఈవీ బ్రాండ్ ఏటిర్గోను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో భారత దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏటిర్గో యాప్ ‌స్కూటర్ మొట్టమొదట 2018లో త‌యారైంది. ఇది సింగిల్ ఛార్జింగ్ తో 240 కిలోమీట‌ర్లు దూరం వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలుపుతుంది. ఈ ఎలక్ట్రిక్ ‌స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫుల్‌ క‌ల‌ర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి బిట్‌లతో పాటు అన్ని ఎల్‌ఇడి లైటింగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఉన్న ఈథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ వంటి స్కూట‌ర్లకు ఈ రాబోయే ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుంది. ఇవన్నీ రూ.1.30ల‌క్ష‌ల నుంచి రూ.2 లక్షల ధ‌ర‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్‌ను రూ.1.25లక్షలకు తీసుకురావాలని భావిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది అక్టోబర్ లో వ‌చ్చే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక ఆ ధరకు అందుబాటులోకి తీసుకొస్తే ఒక సంచలనం అవుతుంది.

చదవండి:

కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్

4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top