ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మెగా పబ్లిక్ ఇష్యూకి ముహూర్తం ఖరారైంది. దాదాపు రూ.30,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా రానున్న ఈ ఐపీఓ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.
ఈ ఇష్యూ ద్వారా ఎన్‌ఎస్‌ఈ మొత్తం మార్కెట్ విలువ రూ. 5 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా. ఐపీఓ విజయవంతమైతే.. 2024 అక్టోబర్‌లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల పబ్లిక్ ఇష్యూ రికార్డును అధిగమిస్తుంది. తద్వారా భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా అవతరిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలోనే ఉంటుంది.


